పదేళ్ల ఎన్నికల కల

Green Signal To Conduct Guntur Municipal Elections - Sakshi

గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు 

కోర్టులో విలీన గ్రామాల సమస్య పరిష్కారం  

జనాభా ప్రాతిపదికన 57 వార్డుల ఏర్పాటు! 

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ 

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటున్న అధికారులు

గుంటూరు నగరవాసుల పదేళ్ల ఎన్నికల కలలు సాకారం కానున్నాయి. ప్రత్యేక అధికారుల పాలన స్థానంలో స్థానిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటి వరకు గ్రామాల విలీనం, వార్డుల పునర్విభజనకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన కేసులు పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు.  

సాక్షి, గుంటూరు:  గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు అడ్డంకులుగా తొలిగాయి. పదేళ్లుగా తరువాత ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. 2010 సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి ఇప్పటికీ గుంటూరు నగరం ప్రత్యేకాధికారుల పాలనే ఉంది. ప్రధానంగా శివారు గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా, వార్డుల పునర్విభజన సక్రమంగా జరగటం లేదని కొంత మంది కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కోర్టు కేసులు పరిష్కారమయ్యాయి. నగరపాలక సంస్థలో లాలుపురం పంచాయతీ విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో నడిచిన వివాదం పరిష్కారమైంది. లాలుపురాన్ని కార్పొ రేషన్‌లో విలీనం చేసేందుకు అంగీకరిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కార్పొరేషన్‌కు పంపటంతో సమస్య పరిష్కారమయింది. మొత్తం మీద విలీన గ్రామాలకు సంబంధించిన సమస్యలు కొలిక్కిరావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  

వార్డుల ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు 
గుంటూరు నగరంలో వార్డులకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. గతంలో నగరంలో 52 వార్డులు ఉన్నాయి. విలీన గ్రామాలకు సంబంధించి 10 వార్డులు ఏర్పాటు చేశారు. మొత్తం 62 వార్డులుగా నగరాన్ని విభజించారు. గుంటూరు నగర పాలక సంస్థలో 7.50 లక్షలకు పైగా జనాభా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా  ప్రాతిపదికన వార్డుల విభజన జరగాల్సి ఉంది. 4 లక్షల జనాభా ఉంటే 50 వార్డులు, తరువాత 50 వేల జనాభాకు ఒక వార్డు చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరును 57 వార్డులుగా పునర్విభజించి ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారని సమాచారం.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వార్డుల పునర్విభజన నోటికేషన్‌ విడుదల చేయనున్నారు. నగర ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులతో వార్డుల పునర్విభజనను ఖారారు చేసేందుకు సుమారు మూడు నెలలు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మార్చిలోపు పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ మార్చిలోపు పూర్తయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైందని సమాచారం.  

తొలగిన అడ్డంకుకలు 
గుంటూరు నగరంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అడ్డంకులు తొలిగాయి. విలీన గ్రామాల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. లాలుపురం గ్రామాన్ని కార్పొరేషన్‌లో విలీనంచేసేందుకు ఆ పంచాయతీ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అనంతరం వార్డుల పునర్విభజన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతాం. – చల్లా అనురాధ, నగరపాలక సంస్థ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top