అన్నదాతకు పంట బీమా

The Government Pays The Crop Insurance Premium YSRCP Govt Mentioned In Budget - Sakshi

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. విపత్తుల సమయంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు చేపట్టింది. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. రైతులకు పంటల ధీమాను కల్పించింది. జిల్లాలో 1,86,825 హెక్టార్లలో సాగుచేసే పంటకు బీమా వర్తించనుందన్న వ్యవసాయాధికారుల ప్రకటనలతో రైతులు సంబర పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం వచ్చిందని... వ్యవ‘సాయం’తో ఆర్థిక కష్టాలు తొలగుతాయని ఆశపడుతున్నారు.  

సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. అందరికీ అన్నంపెట్టే రైతన్నను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలకు శ్రీకారం చుట్టింది. రైతులు పంటలు పండించకపోతే పట్టెడు అన్నం కూడా దొరకదని... రైతులకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కల్పిస్తుందని సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు పంట బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. విపత్తుల సమయంలో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. తొలిబడ్జెట్‌లోనే ప్రీమియం చెల్లించేందుకు రూ.1163 కోట్లు నిధులు కేటాయించారు.

దీంతో విజయనగరం జిల్లాలో 1,86,825  హెక్టార్లలో వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు ధీమాను కలిగించారు. అయితే, ఆరుతడి పంటలకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15 లోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సాగులో ఉన్న పంటల వివరాలను వ్యవసాయాధికారులు సేకరించారు.  ‘ఈ పంట యాప్‌’లో నమోదుచేయాలి. ఈ ప్రక్రియను వ్యవసాయ ఉన్నతాధికారులు వేగవంతం చేయాలి. గడువులోగా పంటల వివరాలు నమోదు చేయకుంటే రైతుల కు నష్టం తప్పదన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. వ్యవసాయశాఖ ఈ పంట యాప్‌ తో పాటు గణాంకశాఖ ఆధ్వర్యంలో క్రాప్‌ బుకింగ్‌ చేసే పద్ధతి కూడా ఉంది.

ఆ వివరా లు ఆధారంగా కూడా ప్రభుత్వం ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. అయి తే, గణాంకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న క్రాప్‌ బుకింగ్‌లో అరొకర వివరాలు ఉంటున్నాయని, దీంతో మిగిలిన రైతులు నష్టపోతారన్న వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు చీపురుపల్లి నియోజకవర్గంలో 7 వేల హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తున్న నేపథ్యంలో గణాంకశాఖ 2 వేల హెక్టార్లులో మాత్రమే పంటను చూపిస్తున్నారు. దీంతో మిగిలిన రైతులకు నష్టం కలగడమే కాకుండా అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. 

పంటల బీమా గడువు దగ్గర పడుతోంది....
పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన గడువు దగ్గరపడుతోంది. ఆరుతడి పంటలకు జూలై 31లోగా, వరి పంటకు ఆగస్టు 15లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ పంట యాప్‌’ ద్వారా వ్యవసాయశాఖ, క్రా>ప్‌ బుకింగ్‌ పద్ధతిలో గణాంకశాఖలు పంటల సాగు వివరాలను నమోదు చేయాలి. ఇంతవరకు వ్యవసాయశాఖ ఈ పంట యాప్‌ అందుబాటులోకి రాలేదు. ఈ పంట యాప్‌ రాగానే పంటల నమోదును  త్వరితగతిన చేపడతాం. 
– ఎన్‌.వి.వేణుగోపాల్, సబ్‌ డివిజినల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, చీపురుపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top