ఎన్టీఆర్‌ వర్సిటీ నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర!

Government conspiracy to depreciate NTR's Varsity - Sakshi

నిధుల పక్కదారిపై ఉద్యోగుల ఆగ్రహం..

వర్సిటీ ఎదుట ధర్నా, స్తంభించిన కార్యకలాపాలు

‘నారాయణ’కు డీమ్డ్‌ హోదా కోసమే ఈ కుట్ర అంటూ మండిపాటు

జీవో నంబర్‌8 రద్దు కోసం ఎందాకైనా పోరాడతామని స్పష్టీకరణ  

విజయవాడ(హెల్త్‌ యూనివర్సిటీ): డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిధులు రూ. 167 కోట్లు పక్కదారి పట్టించడం ద్వారా వర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 8ని రద్దు చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. వర్సిటీ అభివృద్ధి, పరిరక్షణ సమితి ఫోరం పిలుపు మేరకు వర్సిటీ ఉద్యోగులందరూ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా వర్సిటీని సోమవారం పూర్తిగా స్తంభింపజేశారు. వర్సిటీ బయట బైటాయించి «ధర్నా చేశారు.

ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన వర్సిటీ అభివృద్ధికి కించిత్‌ సాయపడని చంద్రబాబు ప్రభుత్వం.. దానిని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా విశాఖపట్నం గీతం మెడికల్‌ కళాశాలకు డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా ఇచ్చినట్లుగానే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకూ ఇచ్చి పేద వర్గాలకు వైద్య విద్య అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యంగా నారాయణ మెడికల్‌ కళాశాలకు డీమ్డ్‌ హోదాను కట్టబెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వర్సిటీని అర్థికంగా బలహీనపరిచే చర్యలకు ప్రభుత్వం పూనుకుందని ఉద్యోగులు ఆరోపించారు. గీతమ్‌ మెడికల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వబోమని ఆనాడు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 1986 యూనివర్సిటీ శాసన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ప్రామాణిక వైద్యవిద్య విధానం ఉండాలని నిర్ధేశించిన మేరకు వారు నిరాకరించాన్నారు. వాస్తవానికి గీతమ్‌కు డీమ్డ్‌ హోదా కట్టబెట్టడం ద్వారా ఒక్క సీటు కూడా కన్వీనర్‌ కోటాకు చెందదని, రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి లాభం చేకూరదని పేర్కొన్నారు.

సొంత క్యాంపస్‌ లేదు.. ఉన్న నిధులూ లాగేసుకుంటారా?
ఇప్పటికే యూనివర్సిటీ అనేక సమస్యలతో నిండి ఉందని, ఇలాంటి సమయంలో వర్సిటీ నిధులను వైద్య కాలేజీలకు కేటాయించి నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్‌ (ఎన్‌ఏబీఎహెచ్‌) గుర్తింపు తెచ్చుకోవాలని సర్కారు భావించడాన్ని వర్సిటీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. వైద్య కళాశాలల్లో పనులను పలు ప్రైవేటు కన్సల్టెన్సీలకు అప్పగించారని, వీటి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. వైద్య కళాశాలలకు గుర్తింపు కొనసాగాలంటే ఎంసీఐ నిబంధనల ప్రకారం ఆసుపత్రులను నిర్వహించాలేకాని, ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు అవసరం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీకి సొంత క్యాంపస్‌ ఇవ్వకపోగా.. ఉన్న నిధులను లాగేసుకోవడంపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. జీవో రద్దు చేసే వరకు ఎంతకైనా పోరాడతామని ఉద్యోగులు హెచ్చరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top