ముహూర్తం ముంచుకొస్తున్నా.. | Godavari puskaralaku looming muhurtam | Sakshi
Sakshi News home page

ముహూర్తం ముంచుకొస్తున్నా..

Jun 28 2015 2:13 AM | Updated on Sep 3 2017 4:28 AM

(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ముంచుకొస్తోంది. పుష్కరాల్లో పుణ్య స్నానాల కోసం లక్షలాదిగా భక్తులు దేశం నలుచెరగుల నుంచి తరలివస్తారని అంచనా.

(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :  గోదావరి పుష్కరాలకు ముహూర్తం ముంచుకొస్తోంది. పుష్కరాల్లో పుణ్య స్నానాల కోసం లక్షలాదిగా భక్తులు దేశం నలుచెరగుల నుంచి తరలివస్తారని అంచనా. పనులలో వేగం పెంచుతానంటూ సీఎం చంద్రబాబు వారం విడిచి వారం రాజమండ్రికి వచ్చిపోతున్నారు. అయినా పలు శాఖల్లో చురుకుదనం లోపించింది. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఈ వారం మరోసారి రాజమండ్రిలో పర్యటించారు. ఈసారి ఆయన సమీక్షలు, చర్చలే కాకుండా  ఘాట్లను సందర్శించి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ‘పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించాలి. ఖర్చు ఎంతైనా ఫర్వాలే’దంటూనే అనవసర ఖర్చు మాత్రం వద్దంటూ ముక్తాయింపునిచ్చారు.
 
 
 అటువంటప్పుడు పుష్కరాలకు ఎన్ని కోట్లయినా ఖర్చుచేస్తామని సీఎం గొప్పలకు పోవడమెందుకన్న విమర్శ వినిపిస్తోంది. నెలాఖరుకు పనులు పూర్తికావాలని ఆయన ఆదేశించారు. అసలు 50 శాతం కూడా పూర్తికాని పనులు నెలాఖరు నాటికి మాత్రం పూర్తవుతాయూ అంటే సందేహాస్పదమేనని హుకుం జారీ చేసిన సీఎంకు కూడా తెలియంది కాదుకదా అని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.
 
 భక్తులకు సదుపాయూలపై అలక్ష్యం వలదు..
 పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది సామాన్య భక్తులకు సౌకర్యాల విషయంలో ప్రభుత్వం అలక్ష్యంపై జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చారు. పుష్కర పనుల్లో అవినీతి, అక్రమాలు, గడువు ముగుస్తున్నా పనులు పూర్తిగాని తీరు సీఎం దృష్టికి వెళ్లలేదంటే నమ్మలేం. అవకతవకలు, నాణ్యతా లోపాలు, అనవసర పనులపై విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కోరారు. ఇప్పటికే అనేక పర్యాయాలు వచ్చి వెళ్లిన సీఎం తగిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతోనే కాంట్రాక్టర్‌లు పనులను వేగవంతం చేయలేకపోయూరన్నది ఓ వాస్తవం.
 
 సర్కారు వైఫల్యంపై కదం తొక్కిన వైఎస్సార్ సీపీ
 చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై జిల్లా వైఎస్సార్ సీపీ ఈ వారం కదనశంఖం పూరించింది. ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అగ్రభాగాన నిలిచారు. బాబు సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. ‘విజన్ 2020-చంద్రబాబు 420’ అని నినదిస్తూ, ‘పాత సామాన్లు కొంటాం... ఎమ్మెల్యేలను కొంటాం’ అంటూ చంద్రబాబు నైజాన్ని చాటుతూ సాగిన  ధర్నా సర్కారు తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. విజయవంతమైన ఈ ధర్నాతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
 
 జూన్‌లోనే పోటెత్తిన వరద
 ఈ వారంలోనే గోదావరికి వరద పోటెత్తింది. సాధారణంగా జూలై ద్వితీయార్థం లేదా ఆగస్టు నుంచి వచ్చే వరదలు ఈ సారి వర్షాకాలం ప్రారంభంలోనే ముంచెత్తాయి. అసలే అంతంతమాత్రంగా జరుగుతున్న పుష్కర పనులకు ఈ వరదల పుణ్యమా అని ఆటంకం ఏర్పడింది. వరదలతో పుష్కర పనుల్లో డొల్లతనం కూడా బయటపడింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 8 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలో వదలడంతో పలు లంకలు నీటమునిగాయి. తక్కువ స్థాయి వరదలకే లంక గ్రామాలు మునగడం జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరించినట్టయింది. అరుదుగా జూన్‌లోనే వచ్చిన వరదల ఉధృతిని సమీక్షించుకుని రానున్న రోజుల్లో వచ్చే వరదలను ఎదుర్కొనేందుకు సమన్వయం సన్నద్ధం కావలసిన అవసరాన్ని ఎత్తిచూపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement