గోదారి గుడిలో.. పుష్కర జడిలో.. | godavari pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

గోదారి గుడిలో.. పుష్కర జడిలో..

Jul 22 2015 1:58 AM | Updated on Sep 3 2017 5:54 AM

జిల్లాలో భక్తజన గోదారి పరవళ్లు తొక్కుతూనే ఉంది. జల దేవతను మనసారా అర్చిస్తోంది. గుండెల నిండా భక్తి నింపుకుని లక్షలాదిగా

జిల్లాలో భక్తజన గోదారి పరవళ్లు తొక్కుతూనే ఉంది. జల దేవతను మనసారా అర్చిస్తోంది. గుండెల నిండా భక్తి నింపుకుని లక్షలాదిగా తరలివస్తున్న యాత్రికులు పుష్కర జడిలో తడిసి ముద్దవుతున్నారు. పసిమొగ్గల నుంచి వృద్ధుల వరకూ.. గోదారమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ‘చల్లగా చూడమ్మా..’ అని వేడుకుంటున్నారు. పాపాలు.. శాపాలను కడిగేయమని ప్రార్థిస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :పశ్చిమాన పుష్కర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య కోటి దాటబోతోంది. మంగళవారం రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా పవిత్ర గోదావరిలో సుమారు 95 లక్షల మంది స్నానాలు ఆచరించగా, బుధవారం ఉదయానికి ఆ సంఖ్య కోటి దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గడచిన మూడు రోజుల కంటే మంగళవారం భక్తుల రద్దీ ఒకింత తగ్గినా.. చివరి నాలుగు రోజుల్లో యాత్రికులు వెల్లువలా రావొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. భక్తుల రాక కాస్త మందగించిన సమయంలోనూ అధికారులు ఘాట్ల వద్ద  సౌకర్యాల విషయంలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు.
 
 చంద్రబాబు వచ్చివెళ్లారు
 ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం నరసాపురంలో ఆకస్మిక పర్యటన చేశారు. టేలర్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఉదయం హెలికాప్టర్ దిగిన ఆయన నేరుగా వలంధరరేవుకు చేరుకున్నారు. 15 నిమిషాల పాటు అక్కడ పరిస్థితిపై ఆరా తీసిన బాబుమిగిలిన ఘాట్లను చూడకుండానే వెనుదిరిగారు. కనీసం ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేయడం, ఇక్కడ లోపాలను తెలుసుకోవడం గానీ చేయలేదు. దీంతో సీఎం ఎందుకొచ్చారో, ఎందుకెళ్లారో అనే వ్యాఖ్యలు భక్తుల నుంచి వినిపించాయి.
 
 నరసాపురంలో మంచినీటి ఎద్దడి
 నరసాపురంలో మంచినీటి సమస్యతో యాత్రికులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన ప్రతి యాత్రికుడికి తిరు గు ప్రయాణంలో మంచినీటి బాటిల్ ఇచ్చి పంపిస్తామని అధికారులు మొదట్లో ఘనంగా ప్రకటించారు. బాటిళ్ల సరఫరా అరకొరగా సాగుతోంది. పారిశుధ్యం, ఘాట్ల వద్ద వైద్య సౌకర్యాలు తదితర అంశాల్లో రోజులు గడిచే కొద్దీ అధికారుల పర్యవేక్షణ లోపం  కనిపిస్తోంది.
 
 కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
 వాహనాల్లో పుష్కర యాత్రికులు తరలివస్తున్న నేపథ్యంలో టోల్‌గేట్ ఫీజు వసూలు చేయవద్దని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. అయితే తణుకు-పెరవలి మధ్య గల టోల్‌గేట్ వద్ద ఫీజును యథావిధిగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగిన పోలీసులతోనూ టోల్‌గేట్ నిర్వాహకులు వాగ్వివాదానికి దిగారు. ఈ వివాదం కారణంగా జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర పెరవలిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరకు పోలీసులు కలెక్టర్‌కి ఫిర్యాదు చేసి ఊరుకున్నారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి పెరవలిలో ఘాట్ల వద్ద టెంట్‌లు పడిపోయాయి. దీంతో ఉదయాన్నే స్నానానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదారీఘాట్‌లో గల మూడు రేవుల వద్ద వర్షం నీరు నిలిచిపోయింది. పిండ ప్రదాన షెడ్లలో నీరు చేరడంతో ఉదయం పిండ ప్రదానాలు చేసేవారు అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ సమస్య ఇంకా గాడిన పడలేదు.
 
 యలమంచిలిలో వర్షం పాట్లు
 యలమంచిలిలో భారీ వర్షం కారణంగా ఘాట్లకు వెళ్లే మార్గాలు జలమయమయ్యాయి. టెంట్‌లు పడిపోయాయి. తాత్కాలిక మరుగుదొడ్ల రేకులు ఊడిపోయాయి. మధ్యాహ్నానికి గాని అధికారులు పరిస్థితిని చక్కదిద్దలేదు. ఆచంట మండలంలో వర్షం కారణంగా యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌లకు వెళ్లే బస్సులు సమయానికి రాక అవస్థలకు గురయ్యారు.
 
 జెడ్పీ చైర్మన్ ఎక్కడ?
 పన్నెండేళ్లకు వచ్చే పవిత్ర పుష్కరాలు.. అందునా ఇవి 144 ఏళ్లకు ఓసారి వచ్చే  మహాపుష్కరాలంటూ ప్రచారం సాగిన నేపథ్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. ఈ పుష్కర వైభవంలో తాము అధికారిక హోదాలో ఉండటాన్ని గౌరవంగా, అదృష్టంగా భావిస్తూ పుష్కర పనుల్లో తలమునకలవుతున్నారు. కానీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాత్రం ఎక్కడా కానరావడం లేదు. పుష్కర పనుల్లో కీలకం కావాల్సిన బాపిరాజు మొదటి రెండు రోజుల్లో హాజరు వేయించుకుని ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. మంత్రుల తర్వాత ప్రొటోకాల్ హోదాలో జెడ్పీ చైర్మన్‌గా జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పుష్కర పనులను సమీక్షించాల్సిన బాపిరాజు ఎందుకు తెరవెనక్కి వెళ్లిపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 14న పుష్కరాలు మొదలు కాగా, 16వ తేదీ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. అమెరికాలోని తన సోదరుడి వద్దకు వెళ్లారని, పుష్కరాలు అయిన తర్వాతే జిల్లాకు వస్తారని జెడ్పీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా పేరు మారుమోగేలా పుష్కరాలు జరుగుతుంటే.. జిల్లా పరిషత్ చైర్మన్ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు అధికారపార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement