అన్నా, మేధాలకు లేఖలు! | Sakshi
Sakshi News home page

అన్నా, మేధాలకు లేఖలు!

Published Sat, Apr 25 2015 1:37 AM

అన్నా, మేధాలకు లేఖలు! - Sakshi

పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
భూ సమీకరణపై వివరణ  ఇవ్వాలని నిర్ణయం

 
హైదరాబాద్: పైకి గంభీరమైన ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ.. రాజధాని కోసం ప్రభుత్వం భూములు సమీకరించడాన్ని తప్పుబడుతున్న సామాజిక ఉద్యమ నేతలు అన్నా హజారే, మేధాపాట్కర్ లాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఈ ఉద్యమకారులు జరిపిన అనేక పోరాటాలను తాను సమర్థించగా.. ఇప్పుడు ప్రభుత్వ వైఖరిపై వారినుంచే అభ్యంతరాలు వ్యక్తం కావడం బాబును ఇరకాటంలో పడేసింది. రాజధాని ప్రాంతంలో మేధాపాట్కర్ ఇప్పటికే పర్యటించడం, అన్నా హజారే నేరుగా తనకే లేఖ రాయడం వంటి అంశాలపై శుక్రవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చర్చించారు. చివరకు రాజధాని కోసం రైతులందరూ ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారని పేర్కొంటూ వారిద్దరికీ లేఖలు రాయాలనే నిర్ణయానికొచ్చారు.

అయితే ఈ లేఖలను పార్టీ పరంగా రాయాలా? లేక ప్రభుత్వ పరంగానా? అన్న అంశంపై చర్చించారు. చివరకు ప్రభుత్వ పరంగా రాయడమే మంచిదన్న నిర్ణయానికొచ్చారు. శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలు కిమిడి కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రభుత్వ సలహాదారులు సి. కుటుంబరావు, పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులతో బాబు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ఉద్యమకారులెవరూ మాట్లాడలేదన్న అంశం ప్రస్తావనకు రాగా అలాంటి విషయాలేవీ లేఖలో ప్రస్తావించకపోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదిలావుండగా ఏపీ రాష్ట్రావతరణ దినోత్సవం   జూన్ రెండో తేదీన నిర్వహించాలా? లేక  చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదో తేదీన నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న అంశాలపై చర్చించినా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పునర్నిర్మాణ, పునరంకిత, సంకల్ప దినోత్సవం.. తదితరాల్లో ఏ పేరుతో నిర్వహిస్తే బావుంటుందనే అంశంపైనా చర్చించారు.

ఆ భూముల్ని జగ్గీ పరిశీలించారు...

జగ్గీ వాసుదేవ్‌కు భూముల కేటాయింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆయన కేవలం భూములను పరిశీలించి వెళ్లారని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలపై వివరణ ఇవ్వాల్సిందిగా నేతలు, అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని బాబు ఈ సందర్భంగా అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయమై ఏం జరిగిందీ వివరాలు సేకరించాల్సిందిగా సూచించారు.
 

Advertisement
Advertisement