మత్తు.. చిత్తు 

girls who drink alcohol with boys - Sakshi

ఈ నగరానికి ఏమైంది? యువత ఎటువైపు వెళ్తోంది?.. అంటే భయంకరమైన ఉదాహరణలు కళ్లముందు కనిపిస్తున్నాయి. మారిన పాశ్చాత్య సంస్కృతికి అనుగుణంగా యువత అలవాట్లు మార్చుకుని సంప్రదాయాలను మంటగలుపుతోంది. కొత్తగా రెస్టారెంట్లు. పబ్‌లు ఏర్పడటంతో కొంతమంది అబ్బాయిలతో అమ్మాయిలూ మద్యం మత్తులో చిత్తమవుతున్న కేసులు ఇటీవల ఎక్కువగా పోలీసుల దృష్టికి రావడం విజయవాడలో విష సంస్కృతి వేళ్లూనుకుంటోందనడానికి ఉదాహరణలు.

విజయవాడ మొగల్రాజపురంలోని రెండు మహిళా వర్కింగ్‌ హాస్టళ్లు, ఆ ప్రాంతం నిత్యం అర్థరాత్రి వరకూ అబ్బాయిలతో హడావుడి ఉంటుంది. బైకులపై వచ్చే కొందరు యువకులు రోడ్డుపైనే గంటల తరబడి అమ్మాయిలతో మాట్లాడుతూ స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అదే వీధి చివర చీకటిగా ఉండే ప్రాంతంలో కారు నిలిపి ఆడవాళ్లతో మద్యం సేవిస్తున్నారు. స్థానికులు పలుమార్లు అభ్యంతరాలు చెప్పినా తీరు మారలేదు. దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద ఉన్న ఫుడ్‌కోర్టు వద్ద ఓ మహిళ స్కూటీపై కూర్చుని మద్యం సేవించింది. పబ్లిక్‌గా మందు తాగుతుండటంతో పలువురు యువకులు దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.

ఇటీవల ఓ యువతికి కొందరు యువకులు పూటుగా మద్యం తాగించి రోడ్డుపైనే వదిలి వెళ్లిపోయారు.

సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ, గుంటూరు నగరాలు కార్పొరేట్‌ విద్యకు పెట్టింది పేరు. రాజధాని కావడంతో విద్యాసంస్థలు కొత్తవి అనేకం పుట్టుకొస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులూ పెరిగారు. చాలావరకు మహిళలు, విద్యార్థులు వర్కింగ్‌ హాస్టల్‌లోనే ఉంటున్నారు. రెండు నగరాల్లో దాదాపు 520 హాస్టళ్లు ఉన్నాయి. గుంటూరులో 264 ఇంటర్‌ కళాశాలల్లో 94వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కృష్ణాజిల్లాలో 310 కళాశాలల్లో 1.35 లక్షల మంది చదువుతున్నారు. అందులో 30 శాతం మంది వర్కింగ్‌ హాస్టళ్లలోనే ఉంటున్నారు. అలాగే, రెండు జిల్లాల్లో ఉన్నత విద్య అందించే కళాశాలలు దాదాపు 561 ఉన్నాయి. వారిలో 40 శాతం వర్కింగ్‌ హాస్టళ్లలోనే ఉండి చదువుతున్నారు. ఇక ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 5వేల మంది వసతీగృహాల్లో ఉంటున్నారు. వర్కింగ్‌ హాస్టళ్లలో భద్రతా చర్యలు నామమాత్రమే. హాస్టల్‌ నిర్వహకులు పర్యవేక్షణ శూన్యం. అర్ధరాత్రుల వరకూ హాస్టళ్ల తలుపులు తెరిచే ఉంటాయి. కఠిన నిబంధనలు పెడుతుంటే ఎవరూ హాస్టళ్లలో చేరకపోవడంతో నిర్వాహకులూ పెద్దగా పట్టించుకోవట్లేదు. 

చీటింగ్‌.. చాటింగ్‌
వర్కింగ్‌ హాస్టళ్లలోని కొంతమంది అమ్మాయిలు తలుపులు తెరిచి ఆరుబయట ఫోన్‌ చాటింగ్‌లు, సంభాషణలతో కాలక్షేపం చేస్తున్నారు. హాస్టళ్ల వద్దకు అబ్బాయిలు వచ్చి నడిరోడ్లపైనే సంభాషించుకుంటున్నారు. ఇటీవల విజయవాడ సిద్ధార్థ నగర్‌ ఏరియాలో కారులో మహిళతో కలిసి యువకులు మద్యం సేవిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం చెప్పారు. అయినా వారు లెక్కచేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, విజయవాడలోని ఓ పబ్‌లో యువతి మద్యం సేవించి బయటకు వస్తుండగా, తోటి స్నేహితులతో గొడవపడింది. ఆమెను తీసుకెళ్లేందుకు ఫ్రెండ్స్‌ కారులో ఎక్కిస్తుండగా, మద్యం మత్తులో అది కిడ్నాప్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కొందరు ఓ యువతికి మద్యం తాగించి నడిరోడ్డుపై వదిలివెళ్లిన సంఘటన కూడా జరిగింది.

స్పెషల్‌ క్లాసుల పేరుతో..
కొందరు విద్యార్థులు స్పెషల్‌ క్లాసుల పేరుతో రాత్రులు మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, పార్కుల్లో స్నేహితులతో కలిసి తిరుగుతున్నారు. వృత్తి పరంగా బిజీగా ఉంటున్న తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో వారిపై పర్యవేక్షణ లేక పెడదోవ పడుతున్నారు. వారాంతపు పార్టీల పేరుతో భవానీ ఐలాండ్, నదీ తీరంలో ఎంజాయ్‌ చేస్తూ మద్యం సేవిస్తున్నారు. అలాగే, రాజధాని కోసం సమీకరించిన భూముల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటే ఇటీవల స్థానికులు కొందరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలను కొందరు వల వేసి, ఖరీదైన వస్తువులు చూపించి విషసంస్కృతిలోకి నెడుతున్నారు. అలాగే, ఇటీవల పలు తనిఖీల్లో దొరికిన యువత ఫోన్‌లు ఓపెన్‌ చేస్తే, 70 శాతం అశ్లీల చిత్రాలే పోలీసులకు కనిపించాయి. అలాగే, ఇటీవల ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రభుత్వ వైద్యబృందం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే డ్రగ్స్, ధూమపాన వినియోగానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. రాజధానిలో 20 శాతం యువతులు డ్రగ్స్, మద్యం, ధూమపానం వినియోగిస్తున్నట్లు తెలిసింది.

తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు
కార్పొరేట్‌ చదువుల పేరుతో తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. వారిపై ఎంతో నమ్మకంతో దూరంగా పెట్టి చదివిస్తున్నారు. కానీ, వారి నమ్మకాన్ని కొందరు విద్యార్థులు వమ్ము చేస్తున్నారు. స్నేహితుల వలలో చిక్కుకుని విలువలు, సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి చెడుమార్గాన్ని ఎంచుకుంటున్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top