ఎన్నికల సమరానికి సిద్ధం కండి | Get ready for electoral : ysrcp mlas | Sakshi
Sakshi News home page

ఎన్నికల సమరానికి సిద్ధం కండి

Nov 18 2017 8:03 AM | Updated on Aug 14 2018 5:56 PM

Get ready for electoral  : ysrcp mlas - Sakshi

కడప కార్పొరేషన్‌ : రాబోయేది ఎన్నికల ఏడాది, ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులంతా సంసిద్ధంగా ఉండాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా కె.సురేష్‌బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాజం పేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి అనేక కష్ట, నష్టాలను చూశామని, ప్రజల తరుఫున ఉద్యమాలు, దీక్షలు చేశామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకూ విశ్రమించవద్దని శ్రేణులకు సూచించారు. జమ్మలమడుగు, బద్వే ల్‌ నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, డాక్టర్‌ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. 

కొత్తవారికి అవకాశమివ్వండి: సురేష్‌బాబు  
పార్టీ బలోపేతానికి కష్టించి పనిచేయలేని వారు ఇప్పుడే తప్పుకుని, కష్టపడే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నూతన అధ్యక్షుడు, మేయర్‌ సురేష్‌బాబు అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే 25 పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా చేస్తామని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారని, కడప పార్లమెంటుకు తనను అధ్యక్షుడిగా చేసినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

టీడీపీ ప్రభుత్వంపై 98.6 శాతం వ్యతిరేకత : రవీంద్రనాథ్‌రెడ్డి
తెలుగుదేశం ప్రభుత్వంపై 98.6 శాతం మంది ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని ఓ సర్వే వెల్లడించిందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దేశంలో 92 లక్షలా 72 వేల మంది సభ్యత్వం ఉన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సీపీయేనని, అత్యంత ప్రజాదరణ గల నేతల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదవ స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు.  

కుప్పంలో గెలుస్తారో లేదో చూసుకోండి: రఘురామిరెడ్డి
పులివెందులలో కూడా గెలుస్తామని టీడీపీ నాయకులు ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. టీడీపీది బలుపు కాదు వాపేనని, ముందు వారు కుప్పంలో గెలుస్తారో లేదో చూసుకోవాలని హితవు పలికారు. 2019లో టీడీపీ వ్యతిరేఖ ఓటు మనకే పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, జన్మభూమి కమిటీ సభ్యులు అంగడి పెట్టి రేషన్‌కార్డులు, పింఛన్లు, పక్కాగృహాలు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. 

ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడాలి: రాచమల్లు
టీడీపీ ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతీ కార్యకర్తా కృషి చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. రాబోయేది ఎన్నికల కాలమని, అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించాల్సిన గురుతర బాధ్యత నూతన అధ్యక్షుడిపై ఉందన్నారు. కష్టపడి పనిచేసేవారికి ఏ పార్టీలోలేని గౌరవం, గుర్తింపు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. 

కష్టపడేతత్వలో ఇద్దరూ ఇద్దరే: అంజద్‌బాషా
క్రమశిక్షణ, సమయపాలనలో ఇదివరకు పనిచేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు సురేష్‌బాబు ఇద్దరూ ఇద్దరేనని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పడే కష్టంలో కొంత భాగం కష్టపడినా అధికారం మనదేనన్నారు. కడపలో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం కైవసం చేసుకునే దిశగా అందరూ కష్టపడాలని సూచించారు. 

అన్ని కులాలకు సమ ప్రాధాన్యం
వైఎస్సార్‌ సీపీలో అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని, కష్టపడే వారిని పార్టీ తప్పక గుర్తిస్తుందని కడప నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌ తెలిపారు. దళితులకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో తన విషయంలో రుజువయ్యిందన్నారు. అనంతరం పార్టీ నూతన అధ్యక్షుడు కె. సురేష్‌బాబును పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో  ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు, తుమ్మలకుంట శివశంకర్, మాజీ నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్‌ఏ కరిముల్లా, షఫీ, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, చల్లా రాజశేఖర్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, బంగారు నాగయ్య, విజయ్‌కుమార్‌(బూస్ట్‌), కిషోర్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement