నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

Gerdav Accident With Negligence Anantapur - Sakshi

గెర్డావ్‌ ఘటనపై విచారణ

తాడిపత్రి: గెర్డావ్‌ ఉక్కు పరిశ్రమలో విషవాయువు లీకై ఆరుగురు మృత్యువాత పడిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రెవెన్యూ, పోలీస్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు శుక్రవారం గెర్డావ్‌ పరిశ్రమలోని రోలింగ్‌ మిల్లు విభాగాన్ని సందర్శించి కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉత్పత్తి అయి పైపు ద్వారా సరఫరా అవుతున్న ప్రదేశంలో పైపుల నాణ్యత గురించి ఆరా తీశారు. గ్యాస్‌లీక్‌ అయినా దాని ప్రభావానికి లోనుకాకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులు వాడుతున్న సేఫ్టీ పరికరాలను పరిశీలిస్తున్నారు. అయితే విచారణ ముందుకు సాగకుండా రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభమైనట్లు, స్థానిక అధికారపార్టీ నేతలు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

మీడియాకు నో ఎంట్రీ
పరిశ్రమ లోపలికి వెళ్లి మరిన్ని వివరాలను సేకరించాలనుకున్న మీడియాను పోలీసులు అనుమతించలేదు. లోపల ఏమి జరుగుతోందో అర్థం కానిపరిస్థితి నెలకొంది. ఒకానొక దశలో మీడియా ప్రతినిధులకు, పోలీసులకు మధ్య వాగ్వావాదం జరిగింది. చివరకు పరిశ్రమ ముఖ్య అధికారి బాపూజీ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. అయితే అందులో సమగ్రమైన సమాచారం ఏమీ లేదు. కంపెనీ ప్రతినిధులు కూడా దీనిపై నోరు మెదపలేదు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..
గెర్డావ్‌ పరిశ్రమలో జరిగిన ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచినట్లు కనబడుతోంది. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవు. మాస్కులు అందుబాటులో ఉన్నా ధరించలేకపోయారు, మనోజ్‌ అనే కార్మికుడు ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందిన నేపథ్యంలో అతన్ని కాపాడేందుకు మరో ఐదుగురు కార్మికులు వెళ్లడంతో మొత్తం ఆరుగురూ మృతి చెందారు. స్వీయ రక్షణ చర్యలు ఉన్నా వాటిని కార్మికులు విస్మరించారు. ఎక్కువ శాతం నిర్లక్ష్యం పరిశ్రమ యాజమాన్యం వైపే ఉంది. పరిహారం కూడా అధిక మొత్తంలో ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.  
– మలోలా, ఆర్టీఓ, విచారణాధికారి

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
ప్రమాదంలో ఆరుగురు కార్మికులను కోల్పోవడం దురదృష్టకరం. అన్ని కుటుంబాలనూ ఆదుకుంటాం. ఎక్కువ పరిహారం వచ్చేందుకు కృషి చేస్తాం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. పరిశ్రమ లోపల ఎక్కడా యాజమాన్యం నిర్లక్ష్యం లేదు.– శ్రీధర్‌ క్రిష్ణమూర్తి,గెర్డావ్‌ పరిశ్రమ ఎండీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top