కోనసీమలో గ్యాస్‌ బ్లో అవుట్‌

Gas blowout in Konaseema - Sakshi

ఉప్పూడి–1లోని ఓఎన్‌జీసీ బావిలోంచి ఎగసిపడుతున్న గ్యాస్‌

ప్రాణభయంతో పరుగులుతీసిన జనం

ఇద్దరు సిబ్బంది ఆచూకీ గల్లంతు

నిపుణుల పర్యవేక్షణ లేకుండానే పీఎఫ్‌హెచ్‌ సిబ్బంది మూత తెరిచే యత్నంలో ఘటన

పరారైన పీఎఫ్‌హెచ్‌ ప్రతినిధులు

ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఉలిక్కిపడింది. ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్‌ బ్లో అవుట్‌ సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్‌ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఓఎన్‌జీసీ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్‌ పెద్ద శబ్దంతో ఎగసిపడింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు గ్యాస్‌ను అదుపుచేసే యత్నం చేశారు.

ఇంతలో వెల్‌ క్యాప్‌ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో విస్ఫోటనం సంభవించింది. దానికి అతి దగ్గరగా ఉన్న ఇద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నట్టు సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. అయితే.. ఆ ఇద్దరి ఆచూకీ లభించలేదని స్థానికులంటున్నారు. తర్వాత బావి నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్‌ ఎగదన్నడంతో ఆ ప్రాంతమంతా మంచు కమ్మేసినట్టుగా గ్యాస్‌ అలముకుంది. చిన్న నిప్పురవ్వ వెలువడినా పెను ప్రమాదం సంభవిస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలపై మైకుల ద్వారా అధికారులు ప్రచారం చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లు, ఫ్లాష్‌ లైట్లు కూడా ఉప్పూడి గ్రామ పరిసరాలకు తీసుకు రాకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కట్టడి చేసింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఘటనా స్థలం చుట్టుపక్కలంతా గాఢాంధకారం అలముకుంది.  ఉప్పూడి గ్రామంలో 1600 మంది దాకా ఉన్నారు. వారిని చెయ్యేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. 

మూత తెరిచే ప్రయత్నంలోనే ఘటన
అడవిపేట ఓఎన్‌జీసీ డ్రిల్‌ సైట్‌కు అనుబంధంగా ఉన్న ఉప్పూడి–1 బావిలో 2006 ముందు వరకూ ఓఎన్‌జీసీ సొంతంగా గ్యాస్‌ను వెలికితీసింది. తర్వాత బావిలో సహజ వాయువు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో బావిని మూసేసింది. 3 కి.మీ లోతున ఈ బావిలో గ్యాస్‌ ఉంది. 2006లో దీనికి వెల్‌ క్యాప్‌ (బావికి మూతవేయడం) వేసిన ఓఎన్‌జీసీ.. గతేడాది కోల్‌కతాకు చెందిన పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థతో గ్యాస్‌ వెలికితీత ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్నుంచి ఆ సంస్థ పర్యవేక్షణలోనే ఈ బావి నిర్వహణ సాగుతోంది. బావిలో గ్యాస్‌ నిల్వలను అంచనా వేసేందుకు మూత తెరిచేందుకు సంస్థ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే గ్యాస్‌ ఒక్కసారిగా ఎగదన్నింది. 

నిపుణుల పర్యవేక్షణ లేకుండానే..
బావిని మూసేశాక పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాల్లో భాగంగా బావిని తిరిగి తెరవాలంటే ఓఎన్‌జీసీ నిపుణుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. అటువంటిదేం లేకుండా బావి తెరవడం విస్ఫోటనానికి కారణమైంది. ఈ విస్ఫోటనంతో తమకు సంబంధం లేదని ఓఎన్‌జీసీ చెబుతోంది. ఘటన జరిగిన కొద్దిసేపటికే బావి వద్ద పనిచేస్తున్న ఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు పరారవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని అమలాపురం డీఎïస్పీ షేక్‌ మాసూమ్‌ బాషా ధ్రువీకరించారు. పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థపై కేసు నమోదు చేసేందుకు పోలీసు అధికారులు నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top