గరుడ వాహనా గోవిందా..

Garuda Vahanam Service In Tirumala - Sakshi

ప్రియ సేవకుడిశడటపై ఊరేగిన ఏడుకొండల స్వామి

తిలకించిన లక్షలాది మంది భక్తులు

కిక్కిరిసి గ్యాలరీలు, బారికేడ్లు

మార్మోగిన గోవింద నామస్మరణ

వాహన సేవను స్వయంగా పర్యవేక్షించిన ఈఓ, జేఈఓ

సీసీ కెమెరాలతో నిఘా

చిత్తూరు, తిరుమల: లక్షలాది మంది భక్తుల గోవిందనామస్మరణ నడుమ గోవిందుడు ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రియ సేవకుడైన గరుడుడిని వాహనంగా చేసుకుని తిరువీధుల్లో ఊరేగారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలు కిక్కిరిశాయి. తిరుమలలో ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి తోపులాటలూ లేకుండా వాహన సేవ ప్రశాంతంగా ముగిసింది.

రాత్రి 7 గంటలకే వాహనం ప్రారంభం.. భక్తులందరికీ దర్శనభాగ్యం
వాహన సేవను నిర్ణీత సమయం రాత్రి 7 గంటలకే ప్రారంభించారు. వాహన మండపం నుంచి వెలుపలకు వచ్చిన వాహనాన్ని అటు ఇటు తిప్పుతూ గ్యాలరీల్లో ఉండే భక్తులందరూ దర్శించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులు అధికంగా నిరీక్షించే ప్రాంతాల్లో హారతులతో కూడిన దర్శనం కల్పించారు. కూడళ్లలో ఎక్కువ సమయం వాహనాన్ని నిలిపి సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించడంలో ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు సఫలీకృతులయ్యారు.  వాహన సేవను చాలా నిదానంగా ముందుకు సాగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాలరీలు, బారికేడ్ల నుంచి జనం స్వామిని దర్శించుకుని తన్మయత్వం పొందారు. రాత్రి 10 గంటల సమయంలో వాహనం వరాహస్వామి ఆలయం వద్దకు రాగానే వర్షం మొదలైంది. ఘటాటోపంతో వాహనాన్ని ఊరేగించారు.

ఉదయం నుంచే గ్యాలరీల్లో నిరీక్షణ..
బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ వాహన సేవను చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సోమవారం  ఉదయం నుంచే భక్తుల రాక కనిపించింది. ఉదయం మోహినీ అవతారం ఊరేగింపులోనే నాలుగు మాడ వీధులు భక్తులతో నిండాయి. వాహనం ముగిసిన తర్వాత వారు అలాగే గ్యాలరీల్లో కూర్చున్నారు. కొత్తవారు ఉదయం 11 గంటల నుంచే రావడం మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంటకే గ్యాలరీలు నిండుగా కనిపిం చాయి. 4 గంటలకు గ్యాలరీలన్నీ నిండాయి.

భక్తులకు ప్రయాణ కష్టాలు..
గరుడ వాహన సేవకు తరలివచ్చిన భక్తులకు ప్రయాణ కష్టాలు ఎదురయ్యాయి. ద్విచక్ర వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడ్డారు. ఆర్టీసీ బస్సులు అధికంగా ఏర్పాటు చేసినా సరిపోలేదు. సీట్లకోసం భక్తులు అవస్థ పడాల్సి వచ్చింది. అందుకే ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ వాహనాల యాజమాన్యాలు టీటీడీ నిర్ణయించిన రూ.60 కాదని రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. ఘాట్‌ రోడ్డులో వేలాది వాహనాలు రావడంతో తిరుపతి తిరుమల మధ్య ప్రయాణకాలం అరగంట పెరిగింది. తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో వాహనాల రద్దీ పెరగటంతో నామమాత్రంగా తనిఖీలు చేసి, కొండకు అనుమతించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top