సస్పెన్షన్ ఎత్తివేతతో ఇటీవల విధుల్లో చేరిన మెంటాడ మండల పరిషత్ సూపరింటెండెంట్ గంటా వెంకటరావుకు మరో ఉచ్చు బిగుసుకుంది
ప్రిన్సిపల్ సెక్రటరీకి విచారణ నివేదిక
జెడ్పీ సీఈఓ విచారణలో పలు
అభియోగాలు నిర్ధారణ
చర్యలు తీసుకునే అవకాశం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : సస్పెన్షన్ ఎత్తివేతతో ఇటీవల విధుల్లో చేరిన మెంటాడ మండల పరిషత్ సూపరింటెండెంట్ గంటా వెంకటరావుకు మరో ఉచ్చు బిగుసుకుంది. అతను ఇన్‌చార్జి ఎంపీడీఓగా ఉన్న కాలంలో ఎంపీపీ ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి చేపట్టిన విచారణ పూర్తయ్యింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిక ఇప్పటికే వెళ్లిపోయింది. పలు అభియోగాలు నిర్ధారణ కావడంతో మరోసారి చర్యలు తప్పేలా లేవు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఈయన సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.
ఎంపీపీ ఫిర్యాదుతో...
ఇన్‌చార్జి ఎంపీడీఓగా పనిచేసినప్పుడు గంటా వెంకటరావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని(అభియోగాలతో కూడిన 500 పేజీల నివేదిక) కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమ్మ ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక రప్పించాలని విజిలెన్స్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి రాశారు. దీంతో పంచాయతీ రాజ్ కమిషనర్ రంగంలోకి దిగి జిల్లా పరిషత్ సీఈఓను విచారణకు ఆదేశించారు. మరోవైపు ఎంపీపీ ఫోర్జరీ సంతకంతో సమావేశం నిర్వహణ బాధ్యతల్ని వైస్ ఎంపీపీకి అప్పగించినట్టు తయారైన నోట్ ఆర్డర్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు అభియోగాల్లో విచారణ
దీంతో ఒకవైపు జిల్లా పరిషత్ సీఈఓ, మరోవైపు పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తమ విచారణలో భాగంగా ఎంపీపీ ఫోర్జరీ సంతకం వ్యవహారాన్ని తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టు ఇటీవలే వచ్చింది. అందులో ఎంపీపీ సంతకం ఫోర్జరీ చేసినట్టు తేలిందని సమాచారం. తదుపరి చర్యలకు పోలీసులు న్యాయపరమైన సలహా తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా పరిషత్ సీఈఓ చేపట్టిన విచారణ కూడా పూర్తయ్యింది. ఇటీవలే పిన్సిపల్ సెక్రటరీకి విచారణ నివేదిక వెళ్లింది. సీఈఓ విచారణలో పలు అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. దీని ఆధారంగా ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.