ఇంజినీరింగ్‌ విద్యార్థి గదిలో గంజాయి

Ganja Has Found In Engineering Student Room In Rajam - Sakshi

సాక్షి, రాజాం : నగర పంచాయతీ పరిధి డోలపేటలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉంటున్న గదిలో బుధవారం గంజాయి లభ్యమైంది. విద్యార్థుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పట్టణ సీఐ జి.సోమశేఖర్‌ తన సిబ్బందితో దాడి చేశారు. విద్యార్థి తన బ్యాగ్‌లో దాచుకున్న కిలో 25 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. డోలపేటలో నివాసం ఉంటున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి మత్తుకు బానిసై డోలపేటలో ఉంటున్న మరో వ్యక్తి మండల శ్రీనుని ఆశ్రయించాడు.

దీంతో వారిరువురు కిలో 25 గ్రాముల గంజాయిని తెచ్చుకుని వారు సేవించడంతోపాటు మరికొంత విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు వారి రూమ్‌ను సోదా చేశామని సీఐ తెలిపారు. గంజాయితోపాటు వారిరువురిని అదుపులోకి తీసుకుని తహశీల్దార్‌ ఎదుట ప్రవేశపెట్టామని చెప్పారు. తహశీల్దార్‌ ఆదేశాల మేరకు రిమాం డ్‌ పంపిస్తున్నట్లు తెలిపారు. అన్ని తరగతుల్లో మెరిట్‌ స్టూడెంట్‌గా ఉన్న విద్యార్థి ఇలా గంజా యి వ్యవహారంలో పట్టుబడడంతో తోటి విద్యార్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

రాజాంకు పాకిన గంజాయి వ్యాపారం 
నిన్న మొన్నటి వరకు పీడించిన క్రికెట్‌ బెట్టింగ్‌లు, కబడ్డీ బెట్టింగ్‌లతోపాటు ప్రస్తుతం గంజాయి మత్తు కూడా యువతను ఆవరించింది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు ఎలాగైనా గంజాయిని తెప్పించుకుని వాడుతున్నారు. గతంలో గంజాయి విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని మందలించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాకపోగా విద్యార్థులపై వారి కన్నుపడింది.దీంతో విద్యార్థులే టార్గెట్‌గా చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. దీనిపై పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.  

నిఘా పెంచాం: సీఐ సోమశేఖర్‌ 
డోలపేటలోనే ఎక్కువగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఎప్పుటికప్పుడు సమాచారం అందుతుండడంతో నిఘా మరింత పెంచామని పట్టణ సీఐ సోమశేఖర్‌ తెలిపారు. మండల శ్రీను గతంలో కూడా పట్టుబడడంతో మందలించామని, అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని, బుధవారం జరిపిన దాడిలో విద్యార్థితో కలసి మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top