ఆఫర్లతో మోసం | froude with offers | Sakshi
Sakshi News home page

ఆఫర్లతో మోసం

Mar 19 2017 5:31 PM | Updated on May 3 2018 3:20 PM

ఆఫర్లతో మోసం - Sakshi

ఆఫర్లతో మోసం

ఉచిత ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నాయి.

► ఉచితం పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు
► స్మార్ట్‌ ఫోన్లు, జియో ఆఫర్లు ఎర
► వెబ్‌ లింక్‌లను నమ్మితే ఖాతాలో సొమ్ము పోయినట్టే...
► అఫీషియల్‌ లింక్‌లనే విశ్వసించాలి  
► సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు అవసరం


ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వెంకట్రావు స్మార్ట్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. రూ.25,000 విలువైన స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ.499లకే లభిస్తుందని అందులో ఉంది. ఇందుకు తన పేరు, ఊరు, బ్యాంకు ఖాతా తదితర వివరాలు నమోదు చేయమని మెసేజ్‌ వచ్చింది. వెంటనే ఆ వెబ్‌ లింక్‌లో వివరాలు పూర్తి చేశాడు. అంతే...క్షణాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి అధిక మొత్తంలో సొమ్ము విత్‌డ్రా అయినట్టు మెసేజ్‌ వచ్చింది. తాను మోసపోయానని లబోదిబోమన్నాడు.

సాక్షి, విశాఖపట్నం: ‘లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఉచితంగా, నామమాత్రపు ధరకు కావాలంటే ఈ లింక్‌ ఫాలో అవ్వండి’ ‘జియో ఆఫర్‌ కొనసాగాలంటే ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి..అంటూ స్మార్ట్‌ ఫోన్‌లకు ఇటీవల కొన్ని సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. వాట్సప్‌లలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువునా మోసపోవడం ఖాయం. ఇప్పటికే పలు రకాలుగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న నేరస్తులు ఏ అవకాశాన్ని వదలడం లేదు.
స్మార్ట్‌ఫోన్‌కు వాట్సప్‌లో ఓ మెసేజ్‌ వస్తుంది. జియో ఆఫర్‌ ముసిగిపోయిందని, కొనసాగాలంటే కనిపిస్తున్న లింక్‌పై క్లిక్‌ చేయాలని దానిలో రాసి ఉంటుంది. అది చూసి నిజమనుకుని క్లిక్‌ చేయగానే సైబర్‌ దొంగలు తమ పని ప్రారంభించేస్తారు. లింక్‌పై క్లిక్‌ చేయగానే పేరేంటి, ఊరేంటి అంటూ అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. అన్నిటికీ సమాధానాలు ఇస్తూ పోతే చివరిగా ఆన్‌లైన్‌ పేమెంట్‌ కోసం అకౌంట్‌ నెంబర్, పిన్‌ నంబర్‌ నమోదు చేయమంటారు. ఈ వివరాలు పూర్తిచేయగానే మన అకౌంట్‌లో డబ్బులు మాయమైపోతాయి.     

మరో మెసేజ్‌ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తోంది. షియోమీ, యాపిల్, సామ్‌సంగ్‌ కంపెనీల స్మార్ట్‌ ఫోన్లు రూ.25,000 వేలకు పైగా ఖరీదు గలవి కేవలం రూ.499కే లభిస్తాయని దాని సారాంశం. అది చూసి అంత తక్కువగా ఎలా ఇస్తారని, దీనిలో ఏదో మోసం ఉందని కూడా ఆలోచించకుండా కొందరు వెంటనే అక్కడ కనిపిస్తున్న వెబ్‌ లింక్‌ను తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా తెరవగానే మళ్లీ అదే కథ..వివరాలు అడగడం, సొమ్ము లాగడం జరిగిపోతుంది.

నేరస్తులు మరో అడుగు ముందుకు వేసి ఈ మెసేజ్‌ను మరో పది మందికి పంపిచమని, అలా చేస్తే స్మార్ట్‌ఫోన్‌ మీదేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ‘ఉచిత’ మోసాలు నమ్మి వివరాలు నమోదు చేస్తే చివరికి డబ్బు పోగొట్టుకుని బాధపడాల్సి వస్తుందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.


చైతన్యవంతంగా ఉండాలి
ఆన్‌లైన్‌ మోసాల పాల్పడే నేరస్తులు సరికొత్త విధానాలను అవలంబిస్తున్నారు. ఇలాంటి నేరాల్లో పరిశోధన, పరిష్కారం కూడా ప్రయాసతో కూడుకున్నదే. నేరానికి పాల్పడిన వారు స్థానికంగా ఉండరు. ఇతర రాష్ట్రంలోనో, వేరే దేశంలోనో ఉంటారు. ఒకరిద్దరిని వెదికి పట్టుకున్నా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడదు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న చాలా మంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ప్రజలే చైతన్యవంతంగా ఉండాలి.                                           – టి.రవికుమార్‌ మూర్తి,  క్రైమ్‌ డీసీపీ, విశాఖ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement