మధ్యంతర భృతి ఊసేది!?

Four months ago, the tenth is the deadline - Sakshi

నాలుగు నెలల క్రితమే ముగిసిన పదో పీఆర్సీ గడువు 

11వ పీఆర్సీపై తన వైఖరిని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం

రెండు నెలల కిందట కమిటీ వేసి చేతులు దులుపుకున్న వైనం

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన

సాక్షి, అమరావతి బ్యూరో: పదో పీఆర్సీ (పే రివిజన్‌ కమిషన్‌) గడువు ముగిసి నాలుగు నెలలు దాటింది.. 11వ పీఆర్సీ, ఐఆర్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టమైన వైఖరిని ప్రకటించడంలేదు. కొత్త పీఆర్సీ వేస్తారని, తమ జీతాలు పెరుగుతాయని ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రభుత్వం రెండు నెలల క్రితం అశుతోష్‌ మిశ్రా అధ్యక్షతన కంటితుడుపు చర్యగా కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి ఏడాది కాలపరిమితి విధించి చేతులు దులుపుకుంది. ఈ కమిటీ ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కమిటీ నివేదిక వచ్చేలోగా పెరిగిన ధరలతో ఉద్యోగులు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

ఉద్యోగుల ఐక్యతకు చిచ్చు
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించి వారి ఐక్యతను దెబ్బతీసింది. ఉపాధ్యాయులలో పండిట్‌ అప్‌గ్రెడేషన్‌తో ఎస్‌జీటీలకు, పండిట్లకు మధ్య చిచ్చు పెట్టింది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ వివాదంలో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుండటంతో ఐఆర్‌ను అడిగేవారు లేకుండాపోయారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు.. ఎన్‌జీఓలు సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టారు. ఇదే అదునుగా తీసుకుని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
 
తెలంగాణలాగే దాటేస్తారా?
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం 11వ పీఆర్సీ వెంటనే ఇస్తామంటూ చెప్పి కనీసం ఐఆర్‌ని కూడా ప్రకటించకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. తదుపరి నిర్ణయాన్ని గవర్నర్‌కి అప్పగించి చేతులు దులుపుకుంది. ఇక్కడ కూడా జనవరిలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు ఉండటం, ముందస్తుగా సాధారణ ఎన్నికలు జరగనున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు ఇలా మభ్యపెట్టి అలస్యం చేయడంవల్ల ఇప్పటికే రెండు పీఆర్సీలు వెనకబడి ఉన్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రభావం పదవీ విరమణ తర్వాత ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు.

డిసెంబర్‌లోనే నిర్ణయం ప్రకటించాలి
పండిట్‌ అప్‌గ్రెడేషన్, పీఆర్సీ అంశాలను వేర్వేరుగా చూడాలి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు పీఆర్సీలను ప్రకటించే ఎన్నికలకు వెళ్లాయి. జిల్లాల పర్యటనంటూ కమిటీ కాలయాపన చేస్తోంది తప్ప ఉద్యోగుల అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. డిసెంబరులోగా ఐఆర్‌పై సహేతుక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతాం.
– ఎన్‌. రఘురామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (257) రాష్ట్ర అధ్యక్షుడు 

ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం 
పీఆర్సీ గడువు ముగిసి నాలుగు నెలలు పూర్తయినా కమిటీ ఇప్పటివరకు కేవలం ఆరు జిల్లాల్లోనే పర్యటించింది. ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఐఆర్‌ను వెంటనే ప్రకటించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు దిగుతాం. ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
– చేబ్రోలు శరత్‌చంద్ర, బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top