అనుమతి గోరంత.. తవ్వింది కొండంత..

Former Minister Family Members Illegal Mining In Visakha District - Sakshi

బినామీల పేరుతో అక్రమ మైనింగ్‌

రోలుగుంటలో అడ్డగోలుగా రోడ్డు మెటల్‌ తవ్వకాలు 

గుర్తించిన గనులశాఖ విజిలెన్స్‌ అధికారులు 

రూ.5.91 కోట్ల అపరాధ రుసుము విధింపు 

దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జిల్లా మాజీ మంత్రి కుటుంబ సభ్యుల అక్రమాలకు జిల్లాలో కొండలు తరిగిపోయాయి. బినామీల పేరుతో అనుమతులు పొంది గత ప్రభుత్వ హయాంలో చేసిన మైనింగ్‌ అక్రమాలు బయటకొస్తున్నాయి. గోరంత అనుమతులు తీసుకొని కొండలకు కొండలు తవ్వేస్తున్న వ్యవహారాలు గనుల శాఖ విజిలెన్స్‌ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు సదరు సంస్థకు రూ.5,91,23,012 అపరాధ రుసుము విధించారు. జిల్లాలో రోలుగుంట మండలం కంచుగుమ్మల గ్రామంలో సర్వే నెంబర్‌ 1లో 4.10 హెక్టార్లలో ఉన్న కొండను హిమాని స్టోన్‌ క్రషర్‌ అనే సంస్థకు 2009లో మైనింగ్‌ కోసం 15 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. 2024 వరకు వీరికి లీజు సమయం ఉంది. 

47,060 క్యూబిక్‌ మీటర్లకే అనుమతి...  
వాస్తవానికి ఈ సంస్థ 47,060 క్యూబిక్‌ మీటర్ల రోడ్డు మెటల్‌ తవ్వకాలకు మాత్రమే అనుమతులు పొందింది. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ చేపట్టింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోదరుడు, కుమారుల హస్తం ఉండడంతో అధికారులు ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అనుమతులు పొందిన దాని కంటే అధికంగా 1,36,126.08 క్యూబిక్‌ మీటర్లు తవ్వేసింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న కొండ ప్రాంతంలో 6,073.6 క్యూబిక్‌ మీటర్లు అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్‌ చేసేసింది. 

జిల్లాలో భారీ పెనాల్టీ
రోలుగుంట మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై దృష్టిసారించిన గనుల శాఖ రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.ప్రతాప్‌రెడ్డి బృందం గురువారం దాడులు నిర్వహించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో హిమానీ స్టోన్‌ క్రషర్‌ సంస్థకు రూ.5,91,23,012 అపరాధ రుసుమును 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ అధికారులు బి.రవికుమార్, ఎం.సురేష్‌కుమార్, జి.సత్యమూర్తి, ఆర్‌.అమ్మాజి పాల్గొన్నారు. 

జిల్లాలో 11 అక్రమ మైనింగ్‌లు? 
దీంతో పాటు జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఇతర ప్రాంతాల్లో 11 చోట్ల అక్రమ మైనింగ్‌ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాథమిక పరిశీలనలో నాలుగింటిపై త్వరలో దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన బినామీ సంస్థల ద్వారా ఈ మైనింగ్‌ అక్రమాలకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి రూ.100 కోట్లకు పైగా పెనాల్టీ విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top