అందరి చూపు హస్తిన వైపు | focus on bhadrachalam in telangana bill | Sakshi
Sakshi News home page

అందరి చూపు హస్తిన వైపు

Feb 6 2014 5:32 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మం జిల్లా ప్రజానీకం దృష్టంతా ఇప్పుడు హస్తినవైపే ఉంది.

 ఖమ్మం, న్యూస్‌లైన్: రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మం జిల్లా ప్రజానీకం దృష్టంతా ఇప్పుడు హస్తినవైపే ఉంది. గత నాలుగు రోజులుగా తెలంగాణ బిల్లుపై ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పలు పరిణామాలు జిల్లావాసులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.

తెలంగాణ , సీమాంధ్ర ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న జిల్లా కావడంతో ఏ మార్పు జరుగుతుందో..? ఆ మార్పులో ఖమ్మం జిల్లాలోని ఎంత భాగం తెలంగాణ లో ఉంటుందో..? ఏ ప్రాంతాలు సీమాంధ్రలో కలుపుతారో అనే సందేహాలు జిల్లా ప్రజల్లో తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత రాష్ట్ర విభజనలో కీలకంగా మారిన భద్రాచలం భవితవ్యంపై అందరిలో
 ఆందోళన నెలకొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలన్న ప్రతిపాదన రావడం.. దానిపై అటు జీవోఎం కానీ, ఇటు కేంద్రం కానీ ఇంకాస్పష్టంగా ఏదీ తేల్చకపోవడంతో జిల్లా ప్రజలు కీలక సమయంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠలో ఉన్నారు.

ప్రజల తీరు అలా ఉంటే జిల్లా రాజకీయ పరివారం సైతం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఎక్కడికక్కడ తమదే పైచేయి అనిపించేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు ఢిల్లీలోనే మకాం వేయడంతో జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయం కూడా చర్చనీయాంశం అవుతోంది.

 పోటాపోటీగా తరలి వెళ్లిన జిల్లా నేతలు
 రాష్ట్ర విభజనపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జిల్లా నుంచి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు, పలువురు నాయకులు పోటా పోటీగా తరలి వెళ్లారు. మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, నామా నాగేశ్వర్‌రావులు పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. వీరితోపాటు  రాష్ట్ర ఉద్యానవనశాఖ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్క, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కుంజా సత్యావతి, రేగ కాంతారావులు ఢిల్లీలో మకాం వేశారు. అదేవిధంగా  టీడీపీ ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, ఊకె అబ్బయ్యలు కూడా ఢిల్లీ బాటపట్టారు.

 ఢిల్లీలోనూ భద్రాచలంపైనే చర్చ..
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో భద్రాచలం, అశ్వారావుపేట,  మునగాల ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతారా..? తెలంగాణ లోనే ఉంచుతారా..? అనేది ఢిల్లీలో కీలక చర్చగా మారింది. భద్రాచలం విషయంపై  కేంద్రమంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క,  పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు కాంతారావు, కుంజా సత్యావతిలతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు జీవోఎం సభ్యులు జైరాం రమేశ్‌ను కలిసి భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాలను ఖమ్మం జిల్లా నుంచి విడదీయరాదని కోరారు.

 భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయం నిర్మాణం, తెలంగాణ  ప్రజలతో ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని ఆయనకు వివరించారు.  ఇటువంటి పరిస్థితిలో జీవోఎం ఏం నిర్ణయం తీసుకుంటుంది.... కేంద్ర కేబినెట్ ఏమంటుంది? పార్లమెంటులో పెట్టే బిల్లులో ఏముంటుంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement