జల విలయం

Flood Water Flow In Red Canal West Godavari - Sakshi

పోటెత్తిన వరద పొంగుతున్న వాగులు

పొర్లుతున్న జలాశయాలు

వేలాది ఎకరాలు నీట మునక కుంగిన బ్రిడ్జిలు

రాకపోకలకు తీవ్ర అంతరాయం

వరుణ బీభత్సంతో వరదాయినిఉగ్రరూపం దాల్చింది.. ప్రళయభీకరంగా మారి.. జలాశయాలను చీల్చుకుంటూ జనావాసాలపై దండెత్తింది. ఆశలగూళ్లను కబళించింది.  చేలో మొలిచిన చిగురుటాశలను చిదిమేసింది. కన్నీళ్ల కట్టలు తెంచింది. వాగులు, వంకలనుఉరకలెత్తించింది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  జిల్లాలో వరద పోటెత్తింది. వరుణుడి ధాటికి జిల్లా అతలాకుతలమైంది. గత 20 ఏళ్లలో కనీవినీ ఎరుగని వర్షపాతం ఏజెన్సీ మండలం బుట్టాయగూడెంలో నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం కూడా రికార్డుస్థాయిలో కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జిల్లాతో పాటు ఖమ్మం, భద్రాచలం జిల్లాల నుంచి వచ్చిన వరదనీటికి గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలను ముంచెత్తుతోంది. ఎర్రకాలువ, జల్లేరు, తమ్మిలేరు జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఒక్కసారిగా  నీటిని దిగువకు వదిలేశారు. ఫలితంగా భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. విలీన మండలాల్లోని గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. పంట నష్టం రూ.పది కోట్లు ఉంటుందని అంచనా.

కొట్టుకుపోయిన రోడ్లు
పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. జంగారెడ్డిగూడెంలో వందేళ్ల కిత్రం బైనేరువాగుపై నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది.పలుచోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. తమ్మిలేరు, ఎర్రకాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలుచోట్ల కాజ్‌వేలపైకి నీరుచేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా నుంచి తెలంగాణకు, ఏలూరు నుంచి కైకలూరుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జల్లేరు వాగు ఉధృతికి జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం జాతీయరహదారి రెండుచోట్ల తెగిపోవడంతో తెలంగాణకు వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. జీలుగుమిల్లి వద్ద అశ్వారావుపేట వాగు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో జీలుగుమిల్లి నుంచి గత రాత్రి నుంచి గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. సంగంవాగు, అశ్వారావుపేట వాగు, చిన్నచిన్న వాగులూ ఉప్పొంగాయి. జనజీవనం స్తంభించింది. ఆచంటలో నక్కల డ్రెయిన్‌కు వచ్చిన వరద వల్ల వెయ్యి ఎకరాలకుపైగా పంట నీట మునిగింది. కుక్కునూరు మండలంలో ఆదివారం కురిసిన వర్షం వల్ల పలుచోట్ల కొండవాగులు పొంగిపొర్లాయి. దీంతో కుక్కునూరు–అశ్వారావుపేట రహదారిపై పలుచోట్ల వాగులు పొంగి రాకపోకలు నిలిచాయి. కుక్కునూరు– అశ్వారావుపేట రహదారిపై అర్ధరాత్రి సమయంలో రెండు బస్సులు చిక్కుకున్నాయి. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు వచ్చి స్థానిక పాఠశాలలో తలదాచుకున్నారు.

ఎర్రకాలువతో భారీ నష్టం
జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు ఒక్కసారిగా  నీటిని దిగువకు వదిలేశారు. ఫలితంగా భారీగా నష్టం చవిచూడాల్సి వచ్చింది. దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. వందలాది మూగజీవాలు ఎర్రకాలువ వరదలో కొట్టుకుపోయాయి. జలాశయానికి నాలుగు గేట్లు ఉండగా, నాలుగో గేటు మొరాయించింది. అధికారులు, సిబ్బంది ఎంత యత్నించినా గేటుపైకి లేవలేదు. వరద తీవ్రంగా వస్తుందని తెలిసినా ముందు ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జల్లేరు వాగు పొంగింది. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి  హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు మీదుగా మళ్లించారు. కొవ్వూరు నుంచి వచ్చే వాటిని దేవరపల్లి వద్దనే ఆపి గుండుగొలను, ఏలూరు మీదుగా విజయవాడ పంపిస్తున్నారు. ఇక ప్రధాన కాలువ కుడివైపు గండిపడి, పుట్లగట్లగూడెం, దేవులపల్లి గ్రామాల రైతుల పొలాలు నీటమునిగాయి. దిగువకు భారీఎత్తున నీరు విడుదల చేయడంతో పోతవరం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని పలు గ్రామాలు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.  ఎర్రకాలువ, బైనేరు, పులివాగుకలిసిన ప్రదేశం నుంచి వరద ఉధృతి ఉగ్రరూపం దాల్చింది. దీంతో 30 అడుగుల మేర ఎత్తు ఉన్న రాజవరం సమీపంలోని హైలెవల్‌ బ్రిడ్జిని వరద తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్రకాలువ ఉధృతికి మంగపతిదేవీపాలెం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించి గంగవరం గ్రామానికి పలు వాహనాల్లో తరలించారు.

గోదారి మహోగ్రం రూపం
మరోవైపు గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజ్‌తోపాటు మిగిలిన వంతెనలపై కూడా వాహనాలను పోలీసులు అనుమతించలేదు. గోదావరి వరదతో మళ్లీ లంకగ్రామాలు ముంపు గుప్పెట్లోకి వెళ్లాయి. గత 24 గంటల వ్యవధిలో జిల్లాలో 87.1 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. బుట్టాయగూడెంలో ఏకంగా 449 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.   

విలీన మండలాలు విలవిల
విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో వరద బీభత్సం సృష్టించింది. పెద్దవాగు ప్రాజెక్ట్‌ మూడు గేట్లను ఎత్తివేయడంతో వేలేరుపాడు మండలంలోని గుల్లాయి, కమ్మరిగూడెం, వసంతవాడ, భూదేవిపేట, రెడ్డిగూడెం, ఊటగుంపు, రుద్రంకోట తదితర గిరిజన గ్రామాల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనుకోకుండా వచ్చి పడిన వరదతో పలు గ్రామాల ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుట్టలమీదకు పరుగుతీయగా.. నోరులేని మూగ జీవాలు పదుల సంఖ్యలో గల్లంతయ్యాయి.

లంకల్లో కలకలం
గోదావరి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగటంతో తీరప్రాంత లంకల్లో మళ్లీ కలకలం రేగింది.  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లంకల్లో ఉన్న వేల ఎకరాల్లోని పంటలు నీటిలో నానుతున్నాయి. కూరగాయల పంటలు మొత్తం కుళ్లిపోగా కంద, పసుపు పనికిరాదని, ఇక అరటితోటలు మిగిలిఉన్నా గెలలకు మట్టి ఉండటం వల్ల మార్కెట్‌లో ధర లభించదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూలతోటలు, ఆకుకూరలు, పచ్చిమిరపతోటలు నామరూపాల్లేకుండా పోయాయి.  

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
తమ్మిలేరు రిజర్వాయర్‌ నిండిపోవడంతో దిగువకు ఐదువేల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో ఏలూరు సమీపంలోని వైఎస్సార్‌ కాలనీలోకి నీరు చొచ్చుకొచ్చింది. అధికారులు స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల  విద్యుత్‌స్తంభాలు పడిపోయాయి. ఫలితంగా విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలిగింది. జిల్లాలో వందల సంఖ్యలో పూరిగుడిసెలు నేలకొరిగాయి. పలుచోట్ల పైకప్పులు ఊడిపడ్డాయి. గోడలు కూలిపోయాయి. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలోని దాలప్ప చెరువు పొంగి ప్రవహించి పోలసానిపల్లి బీసీ కాలనీలోకి చొచ్చుకొచ్చింది. గ్రామస్తులు ఆ చెరువుకు గండి కొట్టి నీటి ప్రవాహాన్ని మళ్లించారు. లింగపాలెం నుంచి కామవరపుకోట వెళ్లే మార్గంలో గుండేరు వంతెన పైనుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భోగోలు పెద్ద  చెరువు, కె గోకవరం పెద్ద చెరువు అలుగులకు గండ్లు పడ్డాయి.  ఎర్రకాలువ నీరు దువ్వ వయ్యేరులోకి చేరడంతో వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకొస్తోంది. తణుకు మండలంలోని దువ్వ, ముద్దాపురం, కోనాల గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. యనమదుర్రు డ్రెయిన్‌ కూడా ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top