వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్లు, చెరువులకు పడిన గండ్లు..నీట మునిగిన పొలాలు.. ఎటు చూసినా కన్నీటి కష్టాలే. పత్తి పనికి రాకుండా పోగా, వరిచేలు, మొక్కజొన్న మునిగి మొలకలు వస్తున్నాయి.
సాక్షిప్రతినిధి, నల్లగొండ: వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్లు, చెరువులకు పడిన గండ్లు..నీట మునిగిన పొలాలు.. ఎటు చూసినా కన్నీటి కష్టాలే. పత్తి పనికి రాకుండా పోగా, వరిచేలు, మొక్కజొన్న మునిగి మొలకలు వస్తున్నాయి.
నాలుగు రోజులపాటు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో కుంభవృష్టి కురిపిం చిన వరుణుడు కాస్త శాంతించగా, శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం దాకా భువనగిరి, ఆలేరు నియోజ కవర్గాల్లో వాన దంచికొట్టింది. జిల్లా వ్యా ప్తంగా మొత్తం 5291 మిల్లీమీటర్ల (సగటు89.7 మి.మీ) వర్షపాతం నమోదైంది. నార్కట్‌పల్లిలో అధికంగా 309.2 మి.మీ
వర్షం కురవగా, హుజూర్‌నగర్‌లో అత్యల్పంగా 15.6మి.మీ పడింది.
నష్టం అంచనాలో అధికారులు..
జిల్లా వ్యాప్తంగా జరిగిన వర్షం నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నారు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా మేరకు 1.50లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతినడంతో రూ.360కోట్ల మేర నష్టం వాటిల్లింది. 50వేల ఎకరాల్లో వరి పంట తుడిచిపెట్టుకుపోవడంతో రూ.150కోట్ల నష్టం జరిగింది. మొత్తంగా ఈ రెండు పంటలను కోల్పోవడంతో రైతాంగానికి రూ.510 కోట్ల నష్టం వాటిల్లినట్టే. ఈ రెండు పంటలే కాకుండా, మొక్కజొన్న, కంది, మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలూ దెబ్బతిన్నాయి. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి అధికారుల బృందం ఆదివారం జిల్లాలో పర్యటించనుంది. వర్షం పూర్తిగా వెలిసి, వరదలు తగ్గాక వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి శాస్త్రీయంగా నష్టం అంచనా వేస్తామని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు చెప్పాయి.
రూ.250 కోట్ల ఆస్తినష్టం..
జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి. అధికారిక గణాంకాల మేరకు జిల్లాలో 5494 ఇళ్లు దెబ్బతిన్నాయి. 454 కిలోమీటర్ల నిడివిలో ఆర్‌అండ్‌బీ రహదారులు, 532 పంచాయతీరాజ్ రోడ్లు ధ్వంసం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలకు ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. 56 పవర్‌లూమ్స్ దెబ్బతిన్నాయి. మరో 74 తాగునీటి పథకాలు కూడా పనికిరాకుండా అయ్యాయి. మత్స్యశాఖకు రూ.2.02 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా అధికారులు రూ.250కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు లెక్కలు తేల్చారు.
నల్లగొండ శివారు ఆర్జాలబావిలోని వల్లభరావు చెరువు కట్ట తెగి అద్దంకి - నార్కట్‌పల్లి రోడ్డులోని పానగల్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండలాల్లో 90 శాతం పంటలకు నష్టం జరిగింది. 800 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం వద్ద రైల్వే బ్రిడ్జి కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
ఆలేరు పెద్ద వాగు నిండా పారింది. వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆలేరు మండలం ఇక్కుర్తి వాగులో చిక్కుకున్న 3 వేల గొర్రెలు, ఐదుగురు గొర్రెల కాపరులను రక్షించారు. గుండాల మండలంలో 10 కుంటలకు గండ్లు పడ్డాయి. ఆత్మకూర్(ఎం) మండలంలో 5 చెరువులు, కుంటలు గండ్లు పడ్డాయి. ఆలేరులో సిల్క్‌నగర్, పెద్దమ్మబజార్, రంగనాయకవీధిలో వరద నీరు ఇళ్లలోకి వచ్చింది. యాదగిరిగుట్ట మండలంలో మూట కొండూరు, గోధుమకుంట, జంగంపల్లి చెరువులకు గండ్లు పడ్డాయి. 22 ఇళ్లుదెబ్బతిన్నాయి. తుర్కపల్లిలో 60 ఇళ్లకు నష్టం వాటిల్లింది.
భువనగిరి నియోజకవర్గంలో పత్తి పూర్తిగా రంగుమారింది. కంది, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఐకేపీసెంటర్లలోని ధాన్యం మొలకెత్తింది. భువనగిరి సబ్ జైలు ప్రహారి గోడ కూలిపోయింది. 33 మంది ఖైదీలను నల్లగొండ జైలుకు తరలించారు. మూసీకాల్వలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. బీబీనగర్, ముస్త్యా లపల్లిలో గొర్రెలు వరద నీటిలో కొట్టుకుపోయా యి. 10మంది కూలీలకు గాయాలయ్యాయి.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 75వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. 2900 ఎకరాల్లో వరి, కంది, ఆముదం చేలకు నష్టం వాటిల్లింది. 1231 ఇళ్లకు నష్టం వాటిల్లింది.
దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా 7500 ఎకరాల పత్తిపంటలు నీటమునగగా 1200 ఎకరాల వరి పంట నీటమునగడంతో చేతికొచ్చిన పంటలు జలమయం అవడంతో రైతన్నలు దుక్కసాగరంలో మునిగారు. 1342 ఇళ్లు నేలకూలాయి. చందంపేట మండలంలో పలు కుంటలు తెగిపోవడంతో కంభాలపల్లి, పొగిళ్ల, వైజాగ్ కాలనీలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది.
తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కేరు వాగు ఉధతంగా ప్రవహిస్తుండడంతో వాగులోని 3 వేల మోటార్లు కొట్టుకుపోయాయి. 120 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 27 కుంటలకు, చెరువులకు గండ్లు పడ్డాయి. మోత్కూరు, శాలిగౌరారం గ్రామాలకు ఉన్న ప్రధాన రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నకిరేకల్ నియోజక వర్గంలో 8 చెరువు కుం టలు కూడా తెగిపోయాయి. ధర్మారెడ్డి, ఆసీఫ్ నగర్ కాలువలకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. 40 ఏళ్ల తర్వాత చందుపట్ల వాగు ఉధృతంగా పారుతోంది. వరద నీరు హైవే మీదుగా ప్రవహించడంతో కట్టంగూర్ వద్ద రాకపోకలు నిలి చిపోయాయి. మూసీ ప్రాజెక్టు రికార్డు స్థా యిలోకి వరద నీరు రావడంతో అన్ని గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదులుతున్నారు. ఆసిఫ్ నగర్ కాలువకు గండ్లు పడడంతో చిన్న తుమ్మలగూడెంలో వంద గొర్రెలు కొట్టుకుపోయాయి.
సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 23637 ఎకరాల పత్తి, 5774 ఎకరాల వరి పూర్తిగా దెబ్బతింది. మరో 35 ఎకరాల మిర్చి, 200 ఎకరాల వేరుశనగ పంట కూడా పనికి రాకుండా పోయింది. సూర్యాపేట పట్టణంలో ప్రధాన రోడ్లు ధ్వంసమయ్యాయి. సూర్యాపేటకు విద్యుత్ సరఫరా అయ్యే 132 కేవీ లైన్ తడకమళ్ల వద్ద టవర్ కూలిపోవడంతో శనివారం ఉదయం నుంచి సూర్యాపేట పట్టణంతో పాటు నియోజకవర్గమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆగామోత్కూర్, భీమనపల్లి, బొమ్మకల్లు, సల్కునూరు, రావుపెంట, కామేపల్లి గ్రామాల్లో సుమారు 5 వేల ఎకరాల వరి పంటలు నీట మునిగాయి. మిర్యాలగూడ మం డలంలో తడకమళ్ల, తక్కెళ్లపాడు గ్రామాల్లో పా లేరు వాగు వెంట 800 ఎకరాల పంట నీట ము నిగింది. నియోజకవర్గంలోని పాలేరు, మూసీనది, తుంగపాడు బంధం వెంట 300 విద్యుత్ మోటార్లు వరదలో కొట్టుకుపోయాయి.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. నియోజక వర్గవ్యాప్తంగా 1700 ఎకరాలలో వరి పొలాలు నీటమునిగి పోగా పత్తి తోటలు 16,900 ఎకరాలు, మిర్చితోటలు 3,000 ఎకరాలలో దెబ్బతిన్నాయి. 20 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా మరో 10 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి.