కాఫర్‌ డ్యామే మా కొంప ముంచింది.. | Flood Victims Fires On Nara Lokesh In Devipatnam | Sakshi
Sakshi News home page

మీరు కట్టిన కాఫర్‌ డ్యామే మా కొంప ముంచింది

Aug 9 2019 8:30 AM | Updated on Aug 9 2019 1:44 PM

Flood Victims Fires On Nara Lokesh In Devipatnam - Sakshi

దేవీపట్నం(రంపచోడవరం):  ‘‘నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించకుండా మీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు, మీరంతా బాగానే ఉన్నారు, వరదల్లో మేము నానా కష్టాలు పడుతున్నాం’’ అని వరద బాధితులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్‌ను నిలదీశారు. అప్పుడే తమకు పునరావాస ప్యాకేజీ ఇస్తే ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయేవారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌ గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, అప్పారావుతో కలిసి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు.

పోశమ్మ గండి వద్ద నుంచి బోట్‌లో దేవీపట్నంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. వరద బాధితులతో లోకేష్‌ మాట్లాడుతుండగా.. ‘‘కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణమే మా కొంప ముంచింది’’ అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా చేసిన పనికి తమ గ్రామాలు నీట మునిగాయన్నారు. లోకేష్‌ స్పందిస్తూ.. కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఖాళీ వదిలిపెట్టామని చెప్పారు. ఆయన సమాధానంపై వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు కల్పించుకుని కాఫర్‌ డ్యామ్‌ వల్ల వచ్చిన వరద కాదంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు కాఫర్‌ డ్యామ్‌తో ముప్పుందని గత ప్రభుత్వ హయాంలో అనేకమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే కాఫర్‌ డ్యామ్‌ నిర్మించిందని స్ధానికులు ఆరోపించారు. దేవీపట్నం గ్రామంలో నేటికీ ఇంటి పరిహారం గానీ, భూమికి నష్ట పరిహారం గానీ ఇవ్వలేదని బాధితులు వాపోయారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement