ఇన్నాళ్లూ వరదలే అడ్డం ఇక ఇసుక పుష్కలం

Flood barrier is no more for sand supply - Sakshi

భారీగా పుంజుకున్న సరఫరా.. స్టాక్‌ యార్డుల్లో పెరిగిన నిల్వలు 

నేటి నుంచి వారోత్సవాలతో మరింతగా డంపింగ్‌  

అధిక ధరలపై కొరడా.. అక్రమ తవ్వకాలు, రవాణాకు చెక్‌ 

ఇసుక కొరత ఇక ఉండదంటున్న అధికారులు 

రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి, తుంగభద్ర, వంశధార, నాగావళి నదులకు వరద పోటెత్తింది.. శ్రీశైలం డ్యాం, నాగార్జునసాగర్‌ గేట్లు ఈ ఒక్క సీజన్‌లోనే ఎనిమిదిసార్లు ఎత్తారు..  పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం గేట్లు 77 రోజులుగా తెరిచే ఉంచారు.. కృష్ణా, గోదావరిలో ప్రవాహం నేటికీ కొనసాగుతోంది.. ఇంతగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటే ఇసుక రీచ్‌లన్నీ నీట మునిగాయి.. వాస్తవానికి నిర్మాణాలకు, ఇసుకకు ఇది అన్‌సీజన్‌.. గత ఐదేళ్లలో వర్షాలు,వరదలు లేకపోవడంతో కరువొచ్చింది కానీ ఇసుక కొరత ఏర్పడలేదు.. మామూలుగా వర్షాకాలానికి ముందే ఇసుక నిల్వపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉన్నా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు.. వరద తగ్గగానే ఇసుక రీచ్‌ల నుంచి కావాల్సినంత తవ్వవచ్చనే విషయాన్నీ ఇప్పుడు విస్మరించారు.. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇసుక రాజకీయానికి తెర తీయడంపై సర్వత్రా  చర్చ జరుగుతోంది.. ఈ తరుణంలో ఈ సమస్య లోతుల్లోకి వెళ్లి పరిశీలిద్దాం.
 – సాక్షి, అమరావతి

జూలై 31న శ్రీశైలానికి వరద ప్రవాహం చేరింది. ఈ నీటి సంవత్సరంలో ఎనిమిది దఫాలుగా శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చింది. దీని వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్‌ గేట్లను ఎనిమిది దఫాలుగా 42 రోజులపాటు ఎత్తేయాల్సి వచ్చింది. పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం వస్తుండటం వల్ల 77 రోజులు గేట్లు ఎత్తేశారు. ఈ ఏడాది కృష్ణా నదికి 90 రోజులకుపైగా వరద వచ్చింది. నేటికీ ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా బుధవారం ఉదయం 6 గంటల వరకు 798.27 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. 

గోదావరి వరద ప్రవాహం జూన్‌ రెండో వారంలోనే ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను జూన్‌ 25 నుంచి ఇప్పటి వరకు ఎత్తే ఉంచారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటి దాకా 3,739.68 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. 

వంశధార వరద ఉద్ధృతి గొట్టా బ్యారేజీలోకి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో జూన్‌ 30 నుంచి ఇప్పటి దాకా గొట్టా బ్యారేజీ గేట్లు ఎత్తి ఉంచారు. ఇప్పటి దాకా 119.97 టీఎంసీల ప్రవాహం సముద్రంలో కలిసింది. ఎన్నడూ లేని రీతిలో పెన్నా నదిలోనూ ఈ ఏడాది వరద ప్రవాహం భారీగా వచ్చింది. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరింది. దీని వల్ల ఇసుక రీచ్‌లు వరద నీటిలో మునిగిపోయాయి. సాధారణంగా జూన్‌లో వర్షాలు ప్రారంభమవుతాయి. నదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొరతను అధిగమించడానికి ముందు జాగ్రత్తగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే నదులు, వాగులు, వంకల్లోని ఇసుకను తవ్వి నిల్వ చేయడం ప్రభుత్వం బాధ్యత. కానీ అప్పటి సీఎం చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జూన్‌ నుంచి ఈనెల ప్రథమార్థం వరకూ రాష్ట్రంలో ఇసుక కొరతకు దారితీసింది. ఇప్పుడు వరద తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌ల నుంచి భారీ ఎత్తున ఇసుకను తవ్వి తీసి.. ప్రజలకు అవసరమైన మేరకు సరఫరాను రోజురోజుకూ పెంచుతోంది. ప్రస్తుతం రోజూ 1.44 లక్షల టన్నుల ఇసుకను వెలికితీస్తోంది.
   
జగన్‌ సర్కారు చేసిందిదీ..
టీడీపీ సర్కారు హయాంలో ఇసుక మాఫియా దోచుకుందని, దీనికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వమే ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. నూతన పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థను నోడల్‌ ఏజెన్సీగా నియమించి ఇసుక సరఫరా బాధ్యతలు అప్పగించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. రీచ్‌లు, స్టాక్‌ యార్డుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇసుక తరలించే వాహనాలు దారి మళ్లకుండా జీపీఎస్‌ ఏర్పాటు చేయాలని కొత్త పాలసీ పకడ్బందీగా రూపొందించారు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘా పెట్టారు. సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త పాలసీని తీసుకొచ్చింది.

తాజా పరిస్థితి..
నదుల్లో వరద తగ్గుతుండటం, సర్కారు తీసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా పెరిగింది. వారం రోజులుగా డిమాండ్‌కు సరిపడా సరఫరా అవుతోంది. బుక్‌ చేసుకున్న వారికి వెంటనే అందుతోంది. స్టాక్‌ యార్డుల్లో నిల్వలు పెరిగాయి. ఎక్కడా ఇసుక కొరత మాటే వినిపించని విధంగా ప్రభుత్వం గురువారం నుంచి ఈనెల 21వ తేదీ వరకూ ఇసుక వారోత్సవాలను ప్రకటించింది. ఈ సందర్భంగా నీరు ఇంకిన ప్రతి రీచ్‌లో తవ్వకాలు చేపడతారు. ప్రతి స్టాక్‌ యార్డును నిండుగా ఇసుక నింపి అడిగిన వారికి అడిగినంత సరఫరా చేసే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  

- ఇసుక సరఫరాపై పెరిగిన నిఘా. 
అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం.. రూ.2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్ట సవరణకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదం. 
సరిహద్దు చెక్‌పోస్టులన్నింటిలో రాత్రిపూట కూడా పనిచేసే సీసీ కెమెరాలు పది రోజుల్లో ఏర్పాటు.   
కేవలం 13 రోజుల్లో స్టాక్‌ యార్డులకు ఆరు రెట్లు పెరిగిన ఇసుక సరఫరా. 
గత సర్కారు హయాంలో ఇసుక అడ్డగోలు అక్రమ తవ్వకాల వల్ల కృష్ణా, గోదావరి నదుల్లో బావుల్లా ఏర్పడిన గోతులన్నీ ఈ సీజన్‌లో భారీ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఇసుకతో నిండిపోయాయి. 10 కోట్ల టన్నులపైగా ఇసుక వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

రీచ్‌లలోనే కాకుండా ఇతరత్రా యత్నాలు
వరదలవల్ల తాత్కాలికంగా ఇసుక సమస్య ఏర్పడిందని చెప్పి  రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. వీలైనంత మేరకు బహిరంగ (నదుల్లోని) రీచ్‌ల నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక తవ్వకాలు జరుపుతూ స్టాక్‌ యార్డులకు చేర్చుతూ వచ్చింది. ఆరంభంలో రోజుకు 5 వేల టన్నుల ఇసుకను మాత్రమే స్టాక్‌ యార్డులకు తరలించిన ఏపీఎండీసీ దీనిని క్రమేణా పెంచుతూ ఇప్పుడు 1.44 లక్షల టన్నులకు తీసుకెళ్లింది.  
వరదను దృష్టిలో పెట్టుకుని ప్రయివేటు వ్యక్తులకు చెందిన పట్టా భూముల్లో ఎక్కడెక్కడ ఎంతెంత పరిమాణంలో ఇసుక ఉందో గుర్తించి అక్కడ నుంచి తవ్వి ప్రజలకు సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈమేరకు పట్టా భూముల రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంది.  
ప్రజల తక్షణ అవసరాలు తీర్చడం కోసం వంకలు, వాగులు, ఏర్లు (అప్‌ టు థర్డ్‌ స్ట్రీమ్స్‌) లో 300పైగా  రీచ్‌లను గుర్తించింది. గ్రామ సచివాయంలోనే డబ్బు చెల్లించి పర్మిట్లు తీసుకుని స్థానిక అవసరాలకు వీటి నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. 
- దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోబో శాండ్‌ తయారీ యూనిట్లకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. 

టీడీపీ నేతల ఆదాయానికి గండి
టీడీపీ హయాంలో ఇసుక రీచ్‌లలో చెక్‌ పోస్టులే పెట్టలేదు. టీడీపీ నాయకులే ఇసుక మాఫియాగా మారి దోచుకున్నారు. దీనివల్ల సర్కారు ఖజానాకు రూ.2,500 కోట్లు పైగా గండిపడిందని అప్పట్లో ఆర్థిక మంత్రి యనమల ప్రకటించడం గమనార్హం. జగన్‌ సర్కారు కొత్త పాలసీ వల్ల తమ ఆదాయానికి గండి పడుతుందని మాఫియా గ్యాంగులు బాధపడ్డాయి. దానిని విఫలం చేయాలని ప్రయత్నించాయి. ఇసుక సరఫరా టెండర్లలో గిట్టుబాటుకాని ధరలకు టీడీపీ నేతలే బిడ్లు వేయించినట్లు విజిలెన్స్‌ విచారణలో దొరికిపోవడం ఇందుకు నిదర్శనం.  

అన్ని రాష్ట్రాల్లోనూ సమస్య 
ఇతర రాష్ట్రాల్లో లేని ఇసుక సమస్య ఇక్కడే ఎందుకు వచ్చిందని టీడీపీతోపాటు దానికి వంతపాడే కొన్ని రాజకీయ పక్షాల నేతలు మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇసుక దొరక్కపోవడానికి వానలు, వరదలు కారణమని తెలంగాణలో రాస్తున్న ఎల్లో పత్రికలు ఏపీలో మాత్రం ప్రభుత్వంపై కావాలని నిందలేస్తున్నాయి. ఇసుక కొరత వల్ల తెలంగాణలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. తెలంగాణాలో ఆగస్టులో టన్ను ఇసుక రూ.1,250కు దొరకగా, ఆ తర్వాత భారీగా పెరిగింది. టన్ను రూ.2,500 నుంచి రూ.3,600 వరకూ పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) రోజుకు సగటున 40 వేల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపేది. ప్రస్తుతం వరదల వల్ల ఇది 10 వేల టన్నులకు తగ్గింది. దీంతో స్టాక్‌ యార్డుల్లో ఉన్న ఇసుకను కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులు, పెద్ద ప్రైవేట్‌ సంస్థలకు మాత్రమే ఇస్తున్నారు. చిన్న బిల్డర్లు, సొంత ఇళ్లు కట్టుకునే వారి అవసరాల కోసం ఆన్‌లైన్‌లో పరిమిత బుకింగ్‌కు మాత్రమే టీఎస్‌ఎండీసీ అనుమతిస్తోంది. 
కర్ణాటకలోనూ ఇసుక కొరత తీవ్రంగా ఉంది. రాయచూరు దగ్గర కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు జరిపి ప్రజలకు సరఫరా చేయాలని కర్ణాటక ప్రభుత్వం కోరగా ప్రభుత్వ రంగ సంస్థ మైసూర్‌ మినరల్స్‌ ఆ బాధ్యత తమకొద్దని చెప్పిందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.  
తమిళనాడులోనూ తాత్కాలికంగా ఇసుక కొరత ఉంది. అక్కడ కూడా స్థానిక అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళుతున్నారు. ఇలా వర్షాల సమయంలో నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగడం సహజమేనని తమిళనాడుకు చెందిన ఒక ఐఏఎస్‌ అధికారి తెలిపారు.

ఇసుక కొరత అప్పుడే ఉంది
నిజానికి ఇసుక కొరత సమస్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు అధికారంలోకి రాక ముందునుంచే ఉంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఈ ఏడాది మే నెలలో ఈనాడు పత్రిక కథనం ప్రచురించింది. ఒక్క విశాఖ నగరంలోనే సుమారు 30 వేల మంది కార్మికుల జీవనోపాధి కోల్పోయారని, రెండు నెలలుగా తీవ్ర ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని ఆ వార్తలో పేర్కొంది. గతంలో ఎప్పుడూ ఇసుక కొరత లేదని, ఇప్పుడే ఉత్పన్నమైందంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.

భారీగా పెరిగిన ఇసుక నిక్షేపాలు 
మొన్నటి దాకా తాత్కాలికంగా ఇసుక తవ్వకాలకు ప్రకృతి ప్రతికూలంగా మారినప్పటికీ ఇప్పుడు ఇసుక నిక్షేపాలు భారీగా పెరగడానికి అది దోహదపడింది. రీచ్‌లలో నీరు ఇంకిపోతున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు  అన్ని ఏర్పాట్లు చేశాం. రైతుల పట్టా భూముల్లోనే 90 లక్షల టన్నుల ఇసుక ఉంది. తవ్వకాలు జరిపి ప్రజలకు సరఫరా చేసేందుకు వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. స్టాక్‌ యార్డులకు భారీగా ఇసుక చేరవేస్తున్నాం.       
– మధుసూదన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్, ఏపీఎండీసీ   

అడిగిన వారికి అడిగినంత సరఫరా 
వర్షాలు, వరదలు ఆగిపోయినందున వచ్చే వారం రోజుల్లో నదుల్లోని రీచ్‌లన్నీ నీళ్లలోంచి బయటపడతాయి. ఇప్పటికే సరఫరా పెంచాం. ఇకపై అడిగిన వారికి అడిగినంత ఇసుక అందిస్తాం. ఇసుక వారోత్సవాలు ముగిసేలోగా రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక చేరవేసే దిశగా ఏపీఎండీసీ అన్ని చర్యలు 
తీసుకుంటోంది.  
– రాంగోపాల్,  భూగర్భ గనుల శాఖ కార్యదర్శి 

నాడు పేరుకే ఉచితం.. దోపిడీ  నిజం 
అప్పటి సీఎం నివాసం పక్కనే అక్రమ తవ్వకాలు 
ఎన్‌జీటీ అక్షింతలు, జరిమానానే నిదర్శనాలు

రాష్ట్రంలో గత ఐదేళ్లు ఇసుక దందా భారీగా నడిచింది. కొంతకాలం డ్వాక్రా మహిళా సంఘాల ముసుగులో టీడీపీ నాయకులే ఇసుకను అడ్డగోలుగా తవ్వి పొరుగు రాష్ట్రాలకు తరలించి వేల కోట్లు దోచుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలతో రేయింబవళ్లు ఇసుక తోడించి లారీల్లో తరలించారు. అయినా అప్పటి సర్కారు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఈ అక్రమ వ్యవహారం పాత్రధారులు, సూత్రధారులు టీడీపీ పెద్దలు, నాయకులు కావడమేనన్నది బహిరంగ రహస్యం. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై స్వయంగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చంద్రబాబు సర్కారుకు తలంటడం, ఏకంగా రూ.వంద కోట్ల జరిమానా విధించడం తెలిసిందే.  తుంగభద్ర, గోదావరి నదుల్లో ఏకంగా కిలోమీటర్ల కొద్దీ రహదారులు ఏర్పాటు చేయడంపై అప్పట్లో హైకోర్టు ఘాటుగా స్పందించడం గమనార్హం.  

టీడీపీ అధికారంలో ఉండగా ఇసుక దోపిడీని అడ్డుకోవాలని ప్రయత్నించిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పట్ట పగలే విచక్షణా రహితంగా దాడి చేశారు.  ఈ ఘటనపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఎమ్మార్వో ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పైగా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు తప్పంతా ఎమ్మార్వోదేనని తేల్చి, రాజీ యత్నాలు చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో 2017లో ఇసుక అక్రమ రవాణాకు నిరసనగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన మునగలపాళెం గ్రామస్తులపై ఇసుక లారీ దూసుకెళ్లడంతో 15 మంది మృత్యువాత పడ్డారు. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబు స్పందిస్తూ అదంతా వారి తలరాత అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు ఇసుకపై.. అదీ కొరత తీరుతున్న సమయంలో దీక్షకు దిగుతుండటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top