‘సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం’ ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పగడాలపేట,
కాకినాడ రూరల్ : ‘సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం’ ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పగడాలపేట, ఉప్పలంక గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ఇది... ఆయన మాట ప్రకారం ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు, కాకినాడ పార్లమెంటు పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్‌లు మత్స్యకార కుటుంబాలను కలసి పార్టీపరంగా రూ.50వేల నగదును బాధితకుటుంబాలకు అందజేశారు. పార్టీ పరంగా ఇచ్చే సాయంతో పాటు ప్రభుత్వపరంగా రావల్సిన ఆర్థికసాయం అందేలా చూస్తామని నాయకులు స్పష్టం చేశారు. ‘ప్రభుత్వపరంగా తమకు ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందలేదని, మీరు చేసిన సాయం ఎన్నటికీ మరువలేమని బాధిత కుటుంబాలు వైఎస్సార్‌సీపీ నాయకుల వద్ద వాపోయాయి.
జననేత జగన్ చల్లగా ఉండాలని పలువురు మత్స్యకార కుటుంబాలు ఆశీర్వదించాయి. నెహ్రూ, వేణు, సునీల్‌లు కరప మండలం ఉప్పులంకలో బొమ్మిడి పెదకామేశ్వరరావు కుటుంబానికి, పగడాలపేటలో కామాడి నూకరాజు, చెక్కా బుజ్జిబాబు, కర్రి రాజు, దరిపల్లి సింహాద్రిలకు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 50వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. తుపానులో బోటు తిరగబడిన సంఘటనలో ఏడుగురు మత్స్యకారులు చనిపోగా, మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన వాడముదుల పెదకోటయ్యకు పరామర్శించి అతడికి రూ.పది వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు.
అనంతరం వైఎస్సార్ విగ్రహం సమీపంలో ఉన్న కుదులు బుజ్జి కుమారుడికి రెండు కళ్లు లేకపోవడంతో ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.ఐదు వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో యువత రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, ముత్యాల సతీష్, రాష్ట్రవాణిజ్య విభాగం కార్యదర్శి ఆనంద్‌న్యూటన్, గట్టి రవి, రామదేవు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులు గరికిన అప్పన్న, కర్రి గంగాచలం, వాసంశెట్టి త్రిమూర్తులు, దాట్ల సత్యనారాయణరాజు, జగడం అప్పారావు, జగడం శ్రీహరి, తోట శ్రీధర్, పులగల శ్రీనుబాబు, దాసరి గంగాధర్ పాల్గొన్నారు.