‘స్వైన్‌ఫ్లూ’ మహమ్మారి | First Swine flu case in Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘స్వైన్‌ఫ్లూ’ మహమ్మారి

Jan 29 2015 2:06 AM | Updated on Sep 2 2017 8:25 PM

విశాఖలో తొలి స్వైన్‌ఫ్లూ కేసు బుధవారం నిర్ధారణ అయ్యింది.

విశాఖలో తొలి కేసు
నాలుగేళ్ల బాలుడికి నిర్ధారణ
మరో ఇద్దరిలో లక్షణాలు
భయాందోళనలో నగర వాసులు
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

 
 విశాఖ మెడికల్: విశాఖలో తొలి స్వైన్‌ఫ్లూ కేసు బుధవారం నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో ఒకరు, ఛాతి ఆస్పత్రిలో మరొకరు చికిత్సపొందుతున్నారు. దీంతో విశాఖలో కలవరం రేగింది. మాస్కులు లేకుండా ఆరుబయటకు జనం రావడానికి సాహసించలేకపోతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కూడా మాస్కులు ధరించి  సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం ఇసుక తోటలో ఓ ప్రై వేట్ ఆస్పత్రికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులకు అనుమానం రావడంతో మెరుగైన వైద్యం కోసం  కింగ్ జార్జ్ హాస్పటల్(కేజీహెచ్)కు పంపించారు. అక్కడి పిల్లల ఐసొలేషన్ వార్డులో బాలుడిని ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లాలాజలం నమూనాలను సేకరించి పరీక్షల కోసం  హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపిఎం) ల్యాబ్‌కు పంపించారు. బాలుడికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు ల్యాబ్ నుంచి బుధవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో సమాచారం అందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి  సరోజిని వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల లాలా జలాజలతో పాటు బాలుడికి వైద్య సేవలందించిన వైద్యుల లాలాజలాల నమూనాలను ముందు జాగ్రత్త చర్యగా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఐదు రోజుల క్రితం గాజువాక ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో పరీక్షలు జరిపగా కాదని తేలింది.


అనంతరం బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పొర్లుపాలెంకు చెందిన 37ఏళ్ల మహిళ మర్రిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వైన్ ప్లూ అనుమానిత లక్షణాలతో మరణించింది. ఆమెకు స్వైన్‌ప్లూ లేదని పరీక్షల్లో తేలింది. ఆమె తొమ్మిదేళ్ల కుమార్తెకు కూడా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేసి సాధారణ అనారోగ్యమేనని నిర్ధారించారు. పలాసకు చెందిన 55 ఏళ్ల వృద్ధుడు జ్వరం, దగ్గు, న్యూమోనియా లక్షణాలతో ఛాతి ఆస్పత్రిని ఆశ్రయించాడు. అతనిని పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుగా భావించి స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. పెదవాల్తేర్ ఆదర్శ్‌నగర్‌కు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఇటీవల తల్లిదండ్రులతో శబరిమలై వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఒకట్రెండు రోజులు హైదరాబాద్‌లో గడిపి విశాఖ వచ్చాడు. హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ తీవ్రత అధికంగా ఉండడం, అదే లక్షణాలు బాలుడిలో కన్పించడంతో బుధవారం మధ్యాహ్నాం కేజీహెచ్‌ను ఆశ్రయించాడు.

బాలుడిలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలు గుర్తించి ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. ఈ ఇద్దరి లాలా జలాలను పరీక్షలకు పంపించారు. నివేదికలు రావాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకూ జిల్లాలో 7 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదు కాగా ఒకరికి వ్యాధి నిర్ధారణ అయ్యింది.

ఐదేళ్లలో 13 మంది దుర్మరణం: 2009 నుంచి జిల్లాలో 60 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదు కాగా 13 మంది దుర్మరణం పాలయ్యారు. 2009లో 29 కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు. 2010లో 16 కేసులు నమోదుకాగా, నలుగురు చనిపోయారు. 2011లో ఒక్క కేసునమోదుకాలేదు. 2012లో 8కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. 2013లో మూడు కేసులు నమోదయ్యాయి.2014లో నాలుగు కేసులు నమోదు కాగా ఇద్దరు చని పోయారు.

అప్రమత్తమైన అధికారులు: స్వైన్‌ఫ్లూ నమోదుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేజీహెచ్‌తో పాటు అన్ని రిఫరల్ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యులను అప్రమత్తం చేశారు. స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రకటించారు. 800 కేసులకు వైద్యానికి మందులు సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో  స్వైన్‌ఫ్లూ తనిఖీ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు డిఎంహెచ్‌ఓ సరోజిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement