పోర్టులో మరో ప్రమాదం

Fire Accident In Visakha Port - Sakshi

అగ్ని కీలల్లో భారీ మొబైల్‌ క్రేన్‌

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే  కారణమని అనుమానాలు

పోర్టు ఇన్నర్‌ హార్బర్‌ ఒకటో బెర్త్‌పై ఘటన 

సకాలంలో మంటలు అదుపులోకి తెచ్చిన ఫైర్‌ సిబ్బంది

తప్పిన ప్రాణనష్టం.. భారీగా ఆస్తి నష్టం!

నష్టం అంచనా వేయాల్సి ఉందంటున్న అధికారులు

సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఇటీవల ఔటర్‌ హార్బర్లో హెచ్‌పీసీఎల్‌కు చెందిన నిర్వహణ టగ్‌లో జరిగిన భారీ ప్రమాదాన్ని మరిచిపోకముందే సోమవారం విశాఖ పోర్టు డబ్ల్యూక్యూ–1 బెర్త్‌పై నిలిపి ఉంచిన మొబైల్‌ క్రేన్‌ (ఎంఈఎల్‌ లీబెర్‌ 400) హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో క్రేన్‌ క్యాబిన్‌ పూర్తిగా దగ్ధం అయింది. పీపీపీ పద్ధతిలో పోర్టులో పనులు నిర్వహిస్తున్న సీ పోల్‌ కంపెనీకి చెందిన హార్బర్‌ మొబైల్‌ క్రేన్‌ (హెచ్‌ఎంసీ) ఇన్నర్‌ హార్బర్లోని డబ్ల్యూక్యూ–1 బెర్త్‌ మీద నిలిపి ఉంచిన ఎం.వి.ఎస్‌ ఫాల్కన్‌ నౌకలోకి ఇనుప ఖనిజాన్ని లోడ్‌ చేస్తోంది. కాగా సాయంత్రం 5.30 గంటల సమయంలో క్రేన్‌ ఇంజిన్‌ రూము(క్యాబిన్‌) లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన డ్రైవరు వేగంగా స్పందించి క్రేన్‌ను నౌకకు దూరంగా తీసుకువెళ్లి నిలిపేసి.. తాను కిందికి దూకేశాడు. ఇంజిన్‌ రూములో షార్ట్‌ సస్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్టు పోర్టు అధికారులు పేర్కొన్నారు.

పోర్టు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దాదాపు గంటసేపు శ్రమించి మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో క్రేన్‌ ఇంజిన్‌ రూమ్‌ పూర్తిగా కాలిపోయింది. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నష్టం భారీ స్థాయిలోనే ఉంటుందని తెలిసింది. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని, ప్రాణనష్టం, వ్యక్తులు గాయాలపాలవ్వడం వంటి సంఘటనలు జరగలేదని పోర్టు యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. మంటలను అదుపుచేసిన తరువాత  డబ్ల్యూక్యూ–1 బెర్త్‌మీద కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే పోర్టులో కొద్దిరోజుల తేడాలోనే రెండు భారీ ప్రమాదాలు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top