
ఆదివారం విజయవాడలోని గుణదల వద్ద సెల్ టవర్ ఎక్కిన ఫాతిమా కళాశాల విద్యార్థులు
విజయవాడ: తమ సమస్యను పరిష్కరించాలంటూ నిరాహార దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు ఆదివారం సెల్ టవర్ ఎక్కారు. బలవన్మరణాలకు సిద్ధమయ్యారు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఫాతిమా విద్యార్థులు గత 26 రోజులుగా విజయవాడ అలంకార్ సెంటర్‌కు సమీపంలోని ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం ఉదయం ఏలూరు రోడ్డులోని గుణదల విద్యుత్ సౌధ వద్ద ఉన్న సెల్ టవర్ వద్దకు ఒకరి తర్వాత మరొకరుగా చేరుకున్న ఇద్దరు విద్యార్థినులు సహా ఆరుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి దానిపైకి ఎక్కారు. తమ సమస్య విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నోటికి కర్చీఫ్‌లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 9 గంటల సమయంలో సమాచారం అందుకున్న తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయ పక్షాల నేతలు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా సెల్ టవర్ వద్ద ధర్నాకు దిగారు.
తమకు ఆత్మహత్యే శరణ్యమని సెల్ టవర్ ఎక్కిన విద్యార్థులు కౌసర్, జకీరా (విద్యార్థినులు), కిషోర్, హసన్, షమీ, జగన్ సెల్‌ఫోన్ ద్వారా మీడియా ప్రతినిధులకు చెప్పారు. పోలీసులు వచ్చి విద్యార్థి సంఘాల నేతలతో పాటు, వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీల నేతలను అరెస్టు చేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, విజయవాడ ఆర్డీఓ హరీష్‌లు వచ్చి సెల్ టవర్‌పై ఉన్న విద్యార్థులతో ఫోన్‌లో చర్చించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడినా టవర్ దిగేందుకు విద్యార్థులు నిరాకరించారు. రోజంతా పలు దఫాలుగా చర్చలు జరిపిన కలెక్టర్ ఇచ్చిన హామీ నేపథ్యంలో నలుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి జగన్‌మోహన్‌రెడ్డి సెల్ టవర్ దిగారు. మరో ఇద్దరు విద్యార్థులు షమి, జగన్ మాత్రం రాత్రి 7 గంటల వరకు టవర్ దిగేందుకు నిరాకరించారు. చివరకు అధికారులు వారికి కూడా నచ్చచెప్పి కిందకు దించారు. సోమవారం ఉదయం 9 గంటలకు వీరు ముఖ్యమంత్రితో భేటీ కానున్నట్లు తెలిసింది.