నీ ప్రేమ.. ఆ చంద్రతారకం!

fathers day sakshi special story - Sakshi

ఉదయం 6 గంటలు. రోజూ ఆ సమయానికి  ఓ వ్యక్తి శ్మశానం వైపు అడుగులేస్తూ కనిపిస్తాడు. అపురూపంగా నిర్మించుకున్న సమాధి వద్దకు వెళ్లి శుభ్రం చేస్తాడు. పూజలు చేసి కాసేపు అక్కడే మౌనంగా కూర్చుండిపోతాడు. ఇదీ అతని దినచర్య. ఇక ఆదివారం రోజున నీళ్లుతీసుకెళ్లి శుభ్రంగా కడిగి పూలు పెట్టి పూజలు చేస్తాడు. పండుగలు.. పబ్బాలు వస్తే కొత్త దుస్తులు, చెప్పులు     కొనుగోలు చేసి ఇంట్లో తయారు చేసిన తినుబండారాలను ఆ సమాధి వద్ద ఉంచి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె మరణంతో కుమిలిపోయిన ఓ తండ్రి.. 18 ఏళ్లుగా తన కుమార్తెపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ‘సాక్షి’ సలాం.

పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరులోని చర్చి కాలనీకి చెందిన చంద్రశేఖర్, సులోచన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూనే కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కుమార్తె అరుణకుమారి అంటే చంద్రశేఖర్‌కు ప్రాణం. 6వ తరగతి చదువుతుండగా మార్చి 30, 2004న విషజ్వరం బారిన పడింది.చికిత్స నిమిత్తం తాడిపత్రికి తీసుకెళ్లగా ఫిట్స్‌ వచ్చి తండ్రి చేతుల్లోనే ప్రాణం విడిచింది. గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి నిర్మించాడు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతి రోజూ ఉదయం 6 గంటల్లోగా సమాధి వద్దకు చేరుకోవడం, పూలు పెట్టి పూజలు చేయడం చేస్తున్నాడు.

 ప్రతి ఆదివారం సమాధిని నీటితో శుభ్రం చేసి పూజిస్తాడు. గత 18 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆ తండ్రి దిన చర్య తప్పకపోవడం చూస్తే కుమార్తెపై ఆయన ప్రేమాభిమానం అర్థమవుతోంది. పండుగలు వస్తే మిగిలిన పిల్లలకు తెచ్చినట్లుగానే అరుణకుమారికి కొత్త బట్టలు, చెప్పులు తీసుకొచ్చి సమాధి వద్ద ఉంచుతాడు. ఇంట్లో చేసుకున్న తినుబండారాలను కూడా తీసుకెళ్లి తన కడుపు నిండినంత సంతృప్తి చెందుతాడు. భౌతికంగా కుమార్తె లేకపోయినా ఆ చిన్నారి జ్ఞాపకాల్లో బతుకుతున్న ఈ తండ్రి ప్రేమ ఆ ‘చంద్ర’ తారకమే. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా కష్టపడి జీవించే చంద్రశేఖర్‌ మిగిలిన పిల్లల భవిష్యత్తుకూ తన వంతు బాటలు వేశాడు. పెద్ద కుమార్తె సునీత బీటెక్‌ పూర్తి చేయగా, డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు అనిల్‌ ఓ ప్రయివేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. మరో కుమారుడు ప్రవీణ్‌ ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. గ్రామస్తులు కూడా కుమార్తెపై ఇతని ప్రేమను చూసి చెమర్చిన కళ్లతో మనసులోనే అభినందిస్తుండటం విశేషం.

అరుణ నా ఊపిరి
చిన్న కూతురు కావడంతో ఎంతో ప్రేమగా చూసుకునేటోన్ని. శానా ఇష్టం ఆ పాపంటే. జరమొచ్చి నా చేతుల్లోనే ప్రాణం ఇడిసింది. ఆ రోజు నుంచి సమాధి కాడ పూజలు చేయనిదే ఏ పనీ చేయను. ఆ పాపను పూజించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పండగలొచ్చినా పబ్బాలొచ్చినా మిగిలిన పిల్లల మాదిరిగానే చూసుకుంటా. ఇన్నేళ్లయినా నా కళ్ల ముందు ఉన్నట్లే ఉంటాది.           
– చంద్రశేఖర్, పుట్లూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top