వర్షార్పణం! | farmers got heavy loss due to untimely rains | Sakshi
Sakshi News home page

వర్షార్పణం!

Mar 6 2014 12:06 AM | Updated on Oct 9 2018 4:55 PM

మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటల ఉత్పత్తులకు భారీ నష్టం వాటిల్టింది.

తాండూరు, న్యూస్‌లైన్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. వ్యాపారులకూ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటల ఉత్పత్తులకు భారీ నష్టం వాటిల్టింది. అమ్ముకునేందుకు యార్డుకు తరలించిన పంటలతోపాటు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులు వర్షార్పణం అయ్యాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. క్రితం రోజు వర్షానికి వేలాది బస్తాల వేరుశనగలు, కందులు, శనగలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 12 వేల బస్తాల్లో నిల్వ చేసిన వేరుశనగలు నల్లగా రంగు మారాయి. సుమారు రూ.2 కోట్ల మేరకు పప్పుధాన్యాల ఉత్పత్తులు వర్షంలో తడిసి నష్టం వాటిల్లిందని వ్యాపారులు వాపోయారు.

 ఒకవైపు వర్షం జోరు.. మరోవైపు వడగళ్లు కురవడంతో యార్డులో పంటను కాపాడుకునేందుకు రైతులు, హమాలీలు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మార్కెట్ యార్డులో పంటలను నిల్వ చేసుకునేందుకు రెండో షెడ్ లేకపోవడమే నష్టానికి కారణమని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు పాలకమండలి, మార్కెట్‌యార్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా షెడ్ నిర్మాణం చేపట్టలేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. అలాగే హైదరాబాద్ మార్గంలోని ఖాంజాపూర్ సమీపంలో కొత్త యార్డు ఏర్పాటులో జాప్యాన్ని వారు తప్పుపడుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చుతారని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మాకెవరు దిక్కని రైతులు వాపోతున్నారు. ఇకముందైనా ఇలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు మార్కెట్‌లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.

 రెండు రోజల నుంచి కురుస్తున్న వర్షాలకు షాబాద్ మండలంలోని కక్కులూరు, కేసారం, నరెడ్లగూడ, హైతాబాద్, మద్దూర్ గ్రామాల్లో మిర్చి, కీరదోస, సొరకాయ, టమాటా, ఉల్లి, క్యాబేజి, కాకర పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, పూలతోటలకు నష్టం వాటిల్లింది.

 వడగళ్లు, ఈదురు గాలులకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, శేరిగూడ, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూరు, నైల్లి గ్రామాల పరిధిలో గల వందలాది ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. పూత, పిందెలు రాలిపోయాయి. రాందాస్‌పల్లి, మల్‌శెట్టిగూడ, చింతపల్లిగూడ తదితర గ్రామాల్లో వడగళ్లు పడడంతో వివిధ పంటలకు నష్టం కలిగింది.

మేడ్చల్ మండలం డబిల్‌పూర్, సోమారం, లింగాపూర్, రాయిలాపూర్, బర్మాజిగూడ, శ్రీరంగవరం గ్రామాల్లో టమాటా, ఆలుగడ్డ పంటలు దెబ్బతిన్నాయి.

 బషీరాబాద్ మండలం జీవన్గిలో వడగళ్ల కారణంగా మిరప పంట దెబ్బతిన్నది. వరుస నష్టాలను చవిచూస్తున్న మిర్చి రైతులకు ఈ సారీ కలిసిరాలేదు.

 కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో అధిక మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. బాచుపల్లి, ధన్నారం, చిప్పలపల్లి, దెబ్బడగూడ, దాసర్లపల్లి గ్రామాల్లో వడగళ్లకు క్యాప్సికం, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. టమాటా, కీరదోస, చిక్కుడు, మొక్కజొన్న పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement