వ్యవ‘సాయం’ కరువై..అప్పులే దరువై..

Farmer Commits Suicide In Chittoor District - Sakshi

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

నేల తల్లినే నమ్ముకుని రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. కష్టాల సేద్యంలో అప్పులే దిగుబడి అయినా గుండె దిటవు చేసుకున్నాడు. ఏదో ఒక రోజు తన ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో వ్యవసాయానికి అప్పులు చేస్తూ వచ్చాడు. చివరకు అప్పుల మోత పెరిగి, రుణదాతల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో కుంగిపోయాడు. పురుగుల మందును ఆశ్రయించాడు. తాను నమ్ముకున్న భూమాత ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. 

సాక్షి, చౌడేపల్లె/ చిత్తూరు: అప్పులు తీర్చలేక పురుగుల మందుతాగి రైతు బలవన్మరణం చెందిన విషాద సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. దిగువపల్లె పంచాయతీ భవానీ నగర్‌కు చెందిన ఏ.దొరస్వామినాయుడు(43) నిరుపేద రైతు. అతనికి  పక్షిరాజపురానికి సమీపంలో పొలం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న పొలంలో నాలుగేళ్ల కాలంలో నాలుగు బోర్లు వేశాడు. ఇందు కోసం రూ.4లక్షలు అప్పు చేశాడు. అలాగే ఇతరుల వద్ద వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నాడు. 1000–1050 అడుగుల లోతుతో బోర్లు వేసినా ఆశించిన ఫలితం శూన్యం. ఇటీవల వేసిన బోరులో అరకొరగా నీళ్లు రావడంతో ఆ గంగనే నమ్ముకున్నాడు. పంట బాగా పండితే  అప్పులు తీర్చవచ్చనే కొండంత ఆశతో మళ్లీ లక్ష రూపాయలకు పైగా  ఖర్చుచేసి టమాట పంట సాగు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది కృష్ణమూర్తి అనే వ్యక్తిని వ్యవసాయంలో భాగస్వామిగా చేసుకుని ఇరు కుటుంబాల మహిళల నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి, వ్యవసాయానికి రూ.85వేలు పంట రుణం తీసుకున్నాడు. అప్పటికే బ్యాంకు, ప్రైవేటు రుణాలు కలిపి రూ.12లక్షల వరకు అప్పు చేరింది.

ఈ నేపథ్యంలో ఉన్న బోరులో నీటి సామర్థ్యం తగ్గి పంటలకు నీళ్లు సరిపోలేదు. చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే ఎండిపోతుండడంతో ఆందోళన చెందాడు. మరోవైపు రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోయాయి. అప్పులు కంటికి కునుకు లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి భోజన సమయంలో తన కుటుంబ సభ్యుల వద్ద అప్పుల విషయమై తీవ్రంగా కలత చెందినట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం టిఫిన్‌ చేయకుండా అన్యమనస్కంగా పొలానికి వెళ్లాడు. బోరు వద్ద కూర్చుని ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. అక్కడే దరిదాపుల్లోని పొలం పనిలో ఉన్న అతడి చిన్నాన్న భార్య గోపాలమ్మ అతడిని చూసి వ్యవసాయ పనులు చేస్తున్నాడని తలచి కొంతసేపటికి వెళ్లిపోయింది. అప్పటికి ఉదయం 9 గంటలు. 10.30 గంటల సమయంలో ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన అంజి అటు వైపు వెళ్లాడు. బోరు వద్ద నోటిలో నురుగ వస్తూ, అపస్మారక స్థితిలో పడి ఉన్న దొరస్వామిని చూశాడు. అతడి పక్కనే పురుగుల మందు డబ్బా పడి ఉండడంతో విషయం అర్థమైంది. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దొరస్వామి కుటుంబీకులు, గ్రామస్తులు హుటాహుటిన దొరస్వామి నాయుడుని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య భారతి, పిల్లలు రేవతి, కీర్తి, జయంతి, జగదీశ్‌ ఉన్నారు. ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ మృతురాలి భార్య తన పిల్లల్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం పలువురినీ విచలితుల్ని చేసింది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు
విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎస్‌ఐ అనిల్‌కుమార్, ఆర్‌ఐ ప్రకాష్, వీఆర్వో నారాయణ మృతుని పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం మదనపల్లె ప్రభుత్వాçసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.రైతు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం
దొరస్వామినాయుడు కుటుంబాన్ని ఆదుకుంటా మని  పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  భరోసా ఇచ్చారు. రైతు ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆయన మృతుని కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి ఓదార్చారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ అంజిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ సంతాపం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top