తమ్ముళ్ల బోగస్‌ మంత్రం

Fake Votes And mistakes In Voter Lists Kurnool - Sakshi

ఓటరు జాబితా నిండా బోగస్‌ ఓట్లే

గత జూన్‌లో డూప్లికేట్‌ ఓటర్లు 62,757

ఏరివేత అంటూ తొలగించిన ఓట్లు 4,784 మాత్రమే

4 నియోజకవర్గాలకు ఈఆర్వోలు లేరు

369 మంది అనధికార బీఎల్‌ఓలు  

ఏకపక్షంగా ఓటరు జాబితా తయారీకి అవకాశం

చేష్టలుడిగిన అధికార యంత్రాంగం

కర్నూలు(అగ్రికల్చర్‌): వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు ఓటరు జాబితాలో గుట్టుచప్పుడు కాకుండా బోగస్‌ ఓట్లు చేర్పించారు. ఫొటో ఒక్కటే.. వేర్వేరు ఐడీ నెంబర్లతో కొన్ని , ఇంటి నెంబర్, భర్త/తండ్రి పేరు మార్పుతో కొన్ని, అడ్రస్‌ మార్పుతో మరికొందరి పేర్లు, ఒక పోలింగ్‌ కేంద్రంలో ఇంటి పేరు ముందు వస్తే... మరో పోలింగ్‌ కేంద్రంలో ఇంటి పేరు తర్వాత ఇలా ఎక్కడ, ఎటు అవకాశం ఉంటే అలా ఓటరు జాబితాలో బోగస్‌ ఓట్లు చేర్పించారు. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 31 వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో అడ్డుగోలుగా బోగస్‌ ఓట్లు చేర్పించేందుకు అధికార పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఓవైపు బోగస్‌ ఓటర్లను చేర్పిస్తునే మరోవైపు జాబితాలో ఉన్న బోగస్‌ ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. జిల్లాలో డూప్లికేట్‌/ మల్టీపుల్‌ ఓటర్లు ఏకంగా 62,757 ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక సాప్ట్‌వేర్‌ ద్వారా గుర్తించడం ఇందుకు నిదర్శనం.  ఇంటింటి పరిశీలన చేపట్టి వీటిని తొలగించాలని కమిషన్‌ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు గత జూన్‌లో డూప్లికేట్‌/ మల్టిపుల్‌ ఓటర్ల వివరాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి విచారణ జరిపినట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో కేవలం 4,784 మందిని మాత్రమే గుర్తించి జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. డూప్లికేట్‌ దేశంలో ఎక్కడ ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉన్నా.. గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, దీని ద్వారా  అలాంటి ఓటర్లను తొలగించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నా ఇదంతా ఒట్టిదేనని తెలుస్తోంది. సెప్టెంబరు 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో  లక్షకు పైగానే బోగస్‌ ఓట్లున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఓటరు జాబితాతయారీకి డిప్యూటీకలెక్టర్‌ల కొరత
ఓటర్ల జాబితా తయారీలో కీలకంగా వ్యవహరించే డిప్యూటీ కలెక్టర్‌(ఈఆర్వోలు)  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 17 ఉండగా 14 పోస్టులను ఈఆర్వోలుగా ఎన్నికల కమిషన్‌ నోటిఫై చేసింది. అయితే 17 పోస్టుల్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  బనగానపల్లి, పత్తికొండ, ఆలూరు, శ్రీశైలం నియోజకవర్గాలకు ఈఆర్వోలు లేరు. శ్రీశైలానికి రెవెన్యూ యేతర అధికారి ఈఆర్వోగా వ్యవహరిస్తున్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరిగే సమయంలో విధిగా ఎన్నికల కమిషన్‌ నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా, ఆగస్టులోనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఏకపక్షంగా ఓటరు జాబితా తయారు చేయించుకోవాలనే లక్ష్యంతోనే డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులను భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేసీ–2, శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్, ఎస్‌ఎస్‌పీ ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ఈహెచ్‌ డిప్యూటీ కలెక్టర్, అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే డిప్యూటీ కలెక్టర్లు ఈఆర్వోలుగా ఉన్నారు. ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఓటరు జాబితా అధికార పార్టీకి అనుకూలంగా తయారయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు 369 మంది అనధికార వ్యక్తులు బీఎల్‌ఓలుగా పనిచేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓటర్ల జాబితా ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఊహించవచ్చు.

కర్నూలు139వపోలింగ్‌ కేంద్రంలో భారీగాబోగస్‌ ఓటర్లు
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 139వ పోలింగ్‌ కేంద్రంలో పలువురికి వేర్వేరు ఐడీ కార్డులతో రెండు, మూడు ఓట్లున్నాయి. పార్వతీబాయి అనే మహిళ ఐడీనెంబర్‌ జెడ్‌జీఎఫ్‌ 2578235,  2578300తో రెండు ఓట్లు కల్గి ఉంది. ఈ పోలింగ్‌ కేంద్రంలో 100కుపైగా బోగస్‌ ఓటర్లున్నట్లు సమాచారం. చాంద్‌బాషా, ఎస్‌ఏ ఖలీల్, మరికొందరు మరణించినప్పటికీ ఓటర్లుగానే ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top