మీసేవ... నకిలీ సేవ

Fake Aadhar Cards in Meeseva Centers at west godavri - Sakshi

అక్రమ సంపాదన కోసం మోసాలు  

 నిబంధనలు పట్టని నిర్వాహకులు

 ఇష్టారాజ్యంగా ధ్రువపత్రాల జారీ

 అధికారుల పర్యవేక్షణ కరువు

వేగం, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలందించేందుకు ప్రవేశపెట్టిన మీసేవ కేంద్రాలు అక్రమాలకు వేదికవుతున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు నిర్వాహకులు, కాసులకు కక్కుర్తి పడే అధికారులతో కుమ్మక్కై నకిలీ దందా సాగిస్తున్నారు. ఆధార్‌కార్డుల్లో పుట్టినతేదీ, వయసు మార్చడం, జనన, మరణ పత్రాలు,  ఆక్వా చెరువుల అనుమతులు, దుకాణాల అనుమతులు.. ఇలా ఏదైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేస్తున్నారు.  జిల్లాలో జరిగిన ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

నిడమర్రు: అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతో జిల్లాలో ప్రతి ఇంటర్నెట్‌ సెంటరు మీ సేవాకేంద్రంగా మారిపోతోంది. ప్రస్తుతం 1,570 కేంద్రాలు ఉండగా, వీటి ద్వారా 22 ప్రభుత్వ శాఖలకు చెందిన 316 రకాల పౌరసేవలు  అందుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల ఫీజులు తదితర సేవలతో

కలిపి  మొత్తం 350 సేవల వరకూ మీసేవా కేంద్రాలు అందిస్తున్నాయి.  జిల్లాలో నాలుగు ఏజెన్సీలకు సంబంధించిన సర్వీస్‌ ప్రొవైడర్లు ద్వారా మీసేవ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రైవేటు భాగస్వామ్య విషయంలో అధికారులు పర్యవేక్షణ కొరడవడంతో నిర్వాహకులు అక్రమాలకు పాల్పడేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది.

1.20లక్షలకు పైగా లావాదేవీలు
ప్రతినెలా మీసేవా కేంద్రాల ద్వారా 1.20 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. వీటిలో రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, మున్సిపల్, విద్యుత్‌ సేవల లావాదేవీలే అధికం. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మన జిల్లాలో మొత్తం 44.21 లక్షల దరఖాస్తులు అందితే 3.88 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో రెవెన్యూవి 30 లక్షలు.  

నకిలీని కనిపెట్టేయొచ్చు
నకిలీధ్రువీకరణ పత్రాలపై ప్రజల్లో అధికారులు అవగాహన కనిపించడం లేదు. మీసేవా కేంద్రం ద్వారా జారీ అయిన సర్టిఫికెట్‌ అసలా, నకిలీనా అనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. మీ సేవా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ పేజీలో కనిపించే ముఖ చిత్రంపై మీ మీసేవ కేద్రం నుంచి పొందిన అప్లికేషన్‌ నంబర్‌ నమోదు చేసి మీ దరఖాస్తు వివరాలతోపాటు, జనరేట్‌ అయిన సర్టిఫికెట్‌ను పరిశీలించవచ్చు.  గతంలో తీసుకున్న పత్రాల డేటానూ పరిశీలించవచ్చు. రెండో పద్ధతి స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి రేటింగ్‌ ఉన్న  బార్‌కోడ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని మీ వద్ద ఉన్న ఒరిజినల్‌ సర్టిఫికెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కానింగ్‌ చేస్తే  సర్టిఫికెట్‌ డేటా కనిపిస్తుంది.

ఇవిగో.. ఉదాహరణలు  
గత ఏడాది నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్న ఆకివీడులోని లక్ష్మీ మీసేవా కేంద్రాన్ని అధికారులు రద్దు చేశారు. నిర్వాహకురాలికి  రూ.50 వేలు జరిమానా విధించారు.

తాడేపల్లిగుడెం కొబ్బరితోటలోని మీసేవ కేంద్రం నిర్వహకుడు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కోసం ఏకంగా ఆర్డీఓ సంతకాన్నే ఫోర్జరీ చేసి చిక్కాడు.

నిడమర్రు మీసేవా కేంద్రం నిర్వాహకుడు చేపల చెరువుల తవ్వకానికి నకిలీ అనుమతి పత్రాలు తయారు చేసి ఇచ్చి అధికారులకు పట్టుపడ్డాడు. దీంతో అధికారులు ఆ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు.
వీటన్నిటికంటే ముందు పెనుగొండ కేంద్రంగా  నకిలీ ఓటర్‌ ఐడీల స్కామ్‌ బయటపడింది.

తాజాగా శనివారం నకిలీ రెవెన్యూ,  
విద్యా ధ్రు«వీకరణ పత్రాల స్కామ్‌ను కుదిపేసింది. దీనిపై నిడమర్రు తహసీల్దార్‌ సుందర్రాజు స్పందిస్తూ.. అక్రమార్కులపై క్రిమినల్‌ చర్యలు తప్పవన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top