ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్న వికలాంగులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు.
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్న వికలాంగులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. వికలాంగులకు పింఛన్ మంజూరు కావాలంటే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు గతంలో ప్రతి రోజు సదరమ్ క్యాంప్ నిర్వహించే వారు. అక్కడే భోజన, నీటి వసతి కల్పించేవారు. ప్రస్తుతం మంగళ, బుధ వారాల్లో మాత్రమే సదరమ్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. శిబిరంలో కొద్ది మందికి మాత్రమే పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. దీంతో మిగిలిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వికలాంగులకు 20 శాతం నుంచి 39 శాతం వరకూ వైకల్యం ఉన్నా రూ.200 పింఛన్ అందిస్తామని మూడో విడత రచ్చబండలో ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీంతో ధ్రువీకరణ పత్రాల కోసం శిబిరాలకు పోటెత్తుతున్నారు. మంగళవారం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన శిబిరానికీ 400 మంది వికలాంగులు హాజరయ్యారు. వీరిలో కేవలం 170 మందికి మాత్రమే పరీక్షలు చేశారు. శిబిరం వద్ద కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదు. వికలాంగులు తొలుత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పాత రిమ్స్‌లోని సదరమ్ కార్యాలయంలో పరీక్షలు చేయించుకుని పార్ట్-ఏ ఫారం తీసుకోవాలి. అక్కడ నుంచి రిమ్స్‌కు రావాలి. ఇలా ఐదు వారాలుగా రిమ్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు.
ఈ విషయాన్ని సదరమ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డేవిడ్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు మరికొంత మందికి పరీక్షలు చేశారు. మిగిలిన వికలాంగుల అవస్థలను వికలాంగుల నాయకుడు కాలేషా ఆ శాఖ ఏడీకి వివరించారు. వికలాంగ మహిళలకు మంగళవారం రాత్రికి సంతపేటలోని వసతి గృహంలో బస ఏర్పాటు చేశారు.