బిగుసుకుంటున్న బెల్ట్‌

Excise Department Focus on Belt Shops - Sakshi

కార్యాచరణ రూపొందించిన ఎక్సైజ్‌ అధికారులు

నివారణకు గ్రామ కమిటీలు

మద్యం వ్యాపారులకు హెచ్చరికలు

వారంలో నిర్మూలనకు కసరత్తు

సాక్షి, విశాఖపట్నం: బెల్టు షాపులపై ఉచ్చు బిగుస్తోంది. మద్యం షాపులకు అనుబంధంగా అనధికారికంగా నిర్వహిస్తున్న ఈ బెల్టు షాపుల నిర్మూలన దిశగా ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలన్న లక్ష్యంలో భాగంగా బెల్టు షాపులను నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం వారం రోజులు గడువిచ్చారు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు కార్యాచరణ రూపొందించారు. బెల్టు షాపుల ఆచూకీ కోసం గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆయా గ్రామాల డ్వా క్రా మహిళలు, పంచాయతీ కార్యదర్శి, ఎక్సైజ్‌ ఎస్‌ఐ లేదా హెడ్‌ కానిస్టేబుల్‌ ఉంటారు. ఎక్కడైనా బెల్టు షాపు ఉంటే దాని నిర్వాహకుడిని బైండోవర్‌ చేసి, కేసు నమోదు చేస్తారు. అలాగే బెల్టు షాపులపై గ్రామాలు, నగరంలోని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. తమ గ్రామం, ప్రాంతంలో బెల్టు షాపులు లేవని తీర్మానం చేయిస్తారు. గ్రామ పంచాయతీల్లో బెల్టు షాపుల ఆచూకీ తెలియజేయడానికి వీలుగా ఎక్సైజ్, పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లను ప్రదర్శిస్తారు. అలాగే ఇప్పటి వరకు బెల్టు షాపులను నిర్వహించినట్టు అనుమానం ఉన్న వారికి కౌన్సెలింగ్‌ ఇస్తారు.

షాపుల్లో ఉన్నతాధికారులకు వాటాలు!
బెల్టు షాపుల నిర్మూలన నిర్ణయం లిక్కర్‌ వ్యాపారులకే కాదు.. కొంతమంది ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకూ ఇబ్బందికరంగా పరిణమించింది. కొన్ని మద్యం షాపుల్లో వీరికి వాటాలుండడమే ఇందుకు కారణం. వీరు మద్యం సిండికేట్లతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నారు. విశాఖ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్‌ ఉన్నతాధికారి ఒకరికి, మరికొందరికి విశాఖ మద్యం సిండికేట్లలో వాటాలున్నాయి. వీరు బినామీల పేరిట లిక్కర్‌ షాపులు నడుపుతున్నారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు తన నియోజకవర్గం పరిధిలో 20కి పైగా మద్యం దుకాణాలున్నాయి. ఒక్క వెలగపూడి ఆధ్వర్యంలోనే నడుస్తున్న షాపుల పరిధిలో వందకు పైగా బెల్టు షాపులున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు, వెలగపూడిల బెల్టు షాపులపై దాడులు చేసి, కేసులు నమోదు చేయాల్సి రావడం స్థానిక అధికారులకు ఒకింత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. 

లిక్కరు వ్యాపారులకు వార్నింగ్‌
మరోవైపు బెల్టు షాపులు నిర్వహించరాదంటూ మద్యం వ్యాపారులను కూడా ఎక్సైజ్‌ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. బెల్టు షాపులు నిర్వహిస్తే మద్యం షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోను, నగరంలోనూ ప్రతి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని మద్యం షాపుల యజమానికి ఈ విషయాన్ని తెలియజేయనున్నారు. అంతేకాదు.. ఎక్కడైనా బెల్టు షాపు నడుపుతున్నట్టు నిర్థారణ అయితే సమీపంలోని మద్యం దుకాణ లైసెన్స్‌ను రద్దు చేస్తామని వారికి తెలియజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీటిని నిర్మూలించడానికి ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు రాత్రి పూట అకస్మిక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించారు.

బెల్టు షాపులు 2 వేలకు పైనే!
జిల్లాలోను, నగరంలోను 402 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో షాపు పరిధిలో 5 నుంచి 7 వరకు బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇలా దాదాపు 2 వేలకు పైగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు అంచనా. ఇప్పుడు వీటన్నిటినీ పూర్తి స్థాయిలో నిర్మూలించే పనిలో ఎక్సైజ్‌ అధికారులు తలమునకలై ఉన్నారు. శుక్రవారం నుంచి బెల్టు షాపుల నిర్మూలనకు శ్రీకారం చుట్టనున్నారు.  

బెల్టు షాపుల్లేకుండా చేస్తాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోను, నగరంలోనూ బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలిస్తాం. దీనిపై కార్యాచరణ రూపొందించాం. గ్రామ కమిటీలు వేస్తున్నాం. రాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. అవసరమైతే సమస్యాత్మక గ్రామాల్లో రాత్రి బస చేస్తాం. బెల్టు షాపులు నిర్వహిస్తూ పట్టుబడితే వారిపై కేసులు పెడతాం. సంబంధిత షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తాం. ఇదే విషయాన్ని మద్యం వ్యాపారులకూ చెప్పాం. వారంలోగా బెల్టు షాపులు లేకుండా చేస్తాం.– టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top