సంస్కరణల దిశగా ఏపీపీఎస్సీ

Exam Papers Will Be Released Online By Tabs For Those Who Are Taking The Exam - Sakshi

ప్రశ్నపత్రాలు లీక్‌ కాకుండా ప్రింటింగ్‌ విధానానికి స్వస్తి

ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రశ్నలు

పరీక్ష సమయానికి ప్రశ్న పత్రాల అప్‌లోడ్‌

వచ్చే నెలలో గ్రూప్‌–1 మెయిన్స్‌ నుంచి అమలు

వెబ్‌సైట్‌లో యూజర్‌ మాన్యువల్‌ విడుదల

సాక్షి, అమరావతి: వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో సంస్కరణల దిశగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసెస్ కమిషన్‌(ఏపీపీఎస్సీ) అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వంటి వాటికి తావు లేకుండా ప్రింటింగ్‌ విధానానికి స్వస్తి పలుకుతోంది. పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్‌లైన్‌లో ట్యాబ్‌ల ద్వారా ప్రశ్న పత్రాలను విడుదల చేయనుంది. రానున్న గ్రూప్‌–1 మెయిన్స్‌ నుంచే దీనికి శ్రీకారం చుడుతోంది. ఇందుకు సంబంధించి యూజర్‌ మాన్యువల్‌ను తాజాగా విడుదల చేసింది. ట్యాబ్‌ల ద్వారా విడుదలయ్యే ప్రశ్నపత్రాన్ని ఎలా ఓపెన్‌ చేయాలో అందులో వివరించారు. కొద్దికాలంక్రితం జరిగిన ఏపీపీఎస్సీ సమావేశంలో.. సంస్కరణల్లో భాగంగా చేపట్టాల్సిన అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాల విడుదల నిర్ణయాన్ని ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల నుంచి అమల్లో పెడుతున్నారు.

అంతా ట్యాబ్‌ల ద్వారానే..
►గ్రూప్‌–1 అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక పరీక్ష సమయానికి ముందు వారికి ట్యాబ్‌లను అందిస్తారు. వారికి నిర్దేశించిన పాస్‌వర్డ్‌ ద్వారా అది తెరుచుకుంటుంది.  
►ఆన్‌లైన్‌లో పరీక్ష సమయానికి ముందు వారి ట్యాబ్‌లలో ప్రశ్నపత్రాలు అప్‌లోడ్‌ అవుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మాత్రమే ఈ ప్రశ్నలు ట్యాబ్‌లలో ఓపెన్‌ అవుతాయి. అంతకుముందు వారు తెరిచినా పరీక్ష సమయం వరకు ప్రశ్నపత్రం రాదు.  
►ప్రశ్నలు కూడా జంబ్లింగ్‌లో ఉంటాయి. పరీక్ష ముగింపు సమయానికి ‘పాప్స్‌అప్‌’ మెసేజ్‌ ట్యాబ్‌లో కనిపిస్తుంది. ఓకే నొక్కిన అనంతరం అభ్యర్థులు ట్యాబ్‌ను అక్కడే పెట్టి పరీక్ష హాలునుంచి బయటకు వెళ్లాలి.
►ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాల విడుదల బాధ్యతను విశ్వసనీయత కలిగిన ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలకు ఏపీపీఎస్సీ అప్పగిస్తోంది. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, కార్యదర్శి సహా ఏ ఒక్కరికీ ఈ ప్రశ్నల గురించిన సమాచారం తెలియకుండా వ్యవహారమంతా అత్యంత గోప్యతతో కొనసాగనుంది.  

డిజిటల్‌ మూల్యాంకనం దిశగా చర్యలు  
గ్రూప్‌–1 మెయిన్స్‌లో అభ్యర్థుల సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా డిజిటల్‌ మూల్యాంకనానికి ఏపీపీఎస్సీ చర్యలు చేపడుతోంది.  
►ఆ మేరకు అభ్యర్థుల సమాధానాల పత్రాలను స్కాన్‌ చేయించి కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు.
►మూల్యాంకనంలో పాల్గొనేవారి మూడ్‌ను బట్టి మార్కులకు ఆస్కారం లేకుండా ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో ఏయే పాయింట్లుండాలి? వాటికి ఎన్నెన్ని మార్కులు వేయాలి? అన్నది ముందుగానే నిపుణుల ద్వారా నిర్ణయిస్తారు. వాటిని ప్రశ్నలవారీగా పొందుపరుస్తారు.
►ఆయా ప్రశ్నలకు వేసే మార్కులి్న.. ఏ కారణంతో అన్ని వేయాల్సి వచి్చందో కూడా మూల్యాంకనదారు తన రిమార్కును పొందుపర్చాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకతకు వీలేర్పడనుంది.  
►సమాధాన పత్రాలను ముందు ఇద్దరితో మూల్యాంకనం చేయిస్తారు. వారిచ్చే మార్కుల మధ్య 50 శాతం, అంతకుమించి వ్యత్యాసం ఉంటే మూడో నిపుణుడి ద్వారా మూల్యాంకనం చేయించనున్నారు.
►మూల్యాంకన సమయంలోనే ఆన్‌లైన్లో మార్కులు నమోదు చేయిస్తారు. ఆటోమేటిగ్గా కౌంటింగ్‌ అవుతుంది. దాన్ని తిరిగి ఎవరూ మార్పు చేసేందుకు వీలుండదు.

హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు..
ఈసారి మెయిన్స్‌ పరీక్షలకు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలని కమిషన్‌ నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు ఆప్షన్లలోనూ మార్పులు చేసింది. పోటీ పరీక్షల కోసం వేలాదిమంది హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నందున వారందరికీ ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top