ఎవరికి వారే.. | Everyone else .. | Sakshi
Sakshi News home page

ఎవరికి వారే..

Mar 15 2014 4:11 AM | Updated on Oct 20 2018 6:17 PM

ఎవరికి వారే.. - Sakshi

ఎవరికి వారే..

తెలుగుదేశం పార్టీ నెల్లూరు మేయర్ అభ్యర్థి వివాదం నాలుగు స్తంభాలాటగా మారింది.

 నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు మేయర్ అభ్యర్థి వివాదం నాలుగు స్తంభాలాటగా మారింది. ఎంతైనా ఓకే అంటూ పార్టీకి చెందిన నలుగురు ముఖ్యులు బరిలోకి దిగడంతో పంచాయితీ హైదరాబాద్‌కు చేరింది. మేయర్ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలో తేల్చుకోవవడానికి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు పలువురు ముఖ్య నేతలు రాజధాని బాటపట్టారు.

మేయర్ అభ్యర్థిగా తమ మద్దతు దారుడినే ఎంపిక చేసుకుని పార్టీ మీద పట్టు సాధించడానికి ఇటీవలే టీడీపీలో చేరిన నేతలతో పాటు, సీనియర్లు సైతం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన మనిషిగా జెడ్.శివప్రసాద్‌ను రంగంలోకి దించారు. ఈనెల 5వ తేదీ పార్టీలో చేరిన శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి నగర పార్టీని తన చేతుల్లో ఉంచుకోవాలనే తలంపుతో కిన్నెర ప్రసాద్‌ను పోటీకి దించారు. మరో శాసనసభ్యుడు ఆదాల ప్రభాకరరెడ్డి నూనెమల్లికార్జున యాదవ్‌ను, నగర కమిటీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తమ మనిషి సతీష్ యాదవ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకోవడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ గ్రూపుల ఆధారంగానే ఒకరినొకరు దెబ్బతీసుకునేలా కార్పొరేటర్ టికెట్ల కేటాయింపునకు కుస్తీలు పడుతున్నారు. తొలివిడతగా ప్రకటించిన 28 మంది అభ్యర్థుల జాబితాతో పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. మిగిలిన డివిజన్ల అభ్యర్థుల ఎంపికలో కూడా తమదే పైచేయి చేసుకోవాలని ఎవరికి వారు వ్యూహ,  ప్రతివ్యూహాలు పన్నుతూ ప్రత్యర్థుల తరఫున మేయర్ రేసులోకి రాగలరని భావిస్తున్న వారికి టికెట్ ఎగరగొట్టే ప్రయత్నాల్లో పడ్డారు. డబ్బే కావాలంటే తాను ‘టెన్ సి’ ఇవ్వడానికి సిద్ధమని ఒక నాయకుడు మాగుంట లేఔట్‌లోని స్థలాన్ని విక్రయించారనే ప్రచారం జరుగుతోంది.

జిల్లా స్థాయిలో ఈ పంచాయితీ తేలే పరిస్థితి కనిపించకపోవడంతో జిల్లా అధ్యక్షుడు రవిచంద్రతో పాటు ముఖ్యనేతలు హైదరాబాద్‌కు బయల్దేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి ఆ నలుగురిలో మేయర్ అభ్యర్థి ఎవరో తేల్చాలని కోరనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల తర్వాత మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని కొందరు నేతలు అధిష్టానవర్గానికి సూచిస్తున్నారు. మేయర్‌ను ఎంపిక చేయకపోతే కార్పొరేట్ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ఎ వరు సమకూర్చాలనే వాదన మరికొందరు లెవనెత్తుతున్నారు

. డివిజన్లలో రెబెల్స్‌ను చల్లబరచుకోవడానికి కూడా మేయర్ అభ్యర్థి ఎంపిక అవసరమని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇన్ని వాదనలు, వివాదాల మధ్యన చంద్రబాబు మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement