టీడీపీ నాయకుని భూ కబ్జాపై విచారణ

Enquiry on TDP Leaders Land Grabbing In Ponduru Srikakulam District - Sakshi

అక్రమంగా ఈ–పాస్‌ పుస్తకం జారీపై స్థానికుల ఆవేదన

అధికారుల అలసత్వంపై మండిపాటు

పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్‌

సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): గత ప్రభుత్వ హయాంలో కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు పాగా వేసేందుకు ప్రయత్నించారు. దీనికి కొంతమంది అధికారులు కూడా సహకరించి, అక్రమంగా ఈ–పాసు పుస్తకాలు జారీ చేయడంతో మరింత సులువుగా స్థలాలను కాజేసేందుకు పన్నాగాలు పన్నారు. మండలంలోని దళ్లిపేట గ్రామంలోని సుమారు 25 ఎకరాల కొండ స్థలాన్ని టీడీపీ నాయకుడు పెయ్యల బోడయ్య కబ్జా చేశాడని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ బడి రఘురాంరెడ్డితో కలసి 107 మంది రైతులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

దీనిలో భాగంగా పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది స్థలం వద్దకు బుధవారం చేరుకొని ఉప తహసీల్దార్‌ బలిజేపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఆ స్థలంపై పట్టాలు ఉన్న పలువురు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ భూమిపై పట్టాలు ఉన్నవారి పేర్లను చదవాలని ఉప తహసీల్దార్‌ బలిజేపల్లి ప్రసాదరావు సూచించడంతో వీఆర్వో జి.వెంకటరావు పట్టాదార్ల పేర్లను చదివి వినిపించారు. అయితే ఈ భూమిపై పట్టా కలిగిన వారి పేర్లలో కబ్జాదారుడు పెయ్యల బోడయ్య పేరు లేకపోవడం గమనార్హం.

అక్రమంగా ఈ–పాస్‌ పుస్తకం జారీ..?
ఈ భూమిపై కబ్జాదారుడు బోడయ్యకు ఎటువంటి పట్టా లేకపోయినా అధికారులు ఈ–పాసు పుస్తకం ఎలా వచ్చిందని వైఎస్సార్‌సీపీ నాయకుడు బడి రఘురాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఈ పాసు పుస్తకాన్ని అధికారులు జారీ చేయడంలో ఆంతర్యం ఏంటన్నారు. ఇటీవలే కబ్జాదారుడు ఈ భూమిలో జీడి, నీలగిరి చెట్లు వేశారని, 25 ఎకరాల భూమి ఆక్రమించుకుంటుంటే అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో మతలబు ఏంటన్నారు. దీనిపై సమధానం చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో అధికారులు విచారణ పూర్తిచేయకుండానే వెనుదిరిగారు.

అర్హులకు పట్టాలిస్తాం
ఈ విషయమై ఉప తహసీల్దార్‌ బలిజేపల్లి ప్రసాదరావు మాట్లాడుతూ సర్వే నంబర్‌ 1 కొండ స్థలంలో పూర్తిస్థాయి విచారణ జరిపి గ్రామంలో లేనివారు, సాగు చేయని వారి పట్టాలను తొలగించి అర్హులకు పట్టాలను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. పరిశీలనలో ఉప తహసీల్దార్‌తో పాటు ఎస్‌ఐ మహ్మద్‌ యాసిన్, మండల సర్వేయర్‌ గణపతి, ఆర్‌ఐ డి.నారాయణమూర్తి, వీఆర్వో జి.వెంకటరావులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top