బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Sat, Nov 9 2013 12:17 AM

Engineering student dies in suspected circumstances

కీసర, న్యూస్‌లైన్: ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలో వెలుగుచూసింది. కళాశాల విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసరగుట్ట సమీపంలో ఉన్న హస్విత ఇంజినీరింగ్ కళాశాలలో వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన వెంకటేష్(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు కాలేజీ అనుబంధ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇటీవల దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థి గురువారం తిరిగి హాస్టల్‌కు వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో వెంకటేష్ హాస్టల్ నుంచి బయటకు వె ళ్లాడు. కొద్దిసేపటి తర్వాత క్యాంపస్‌కు వచ్చిన అతడు  గేట్‌లోకి ప్రవేశించగానే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
 
 నోట్లో నుంచి నురగలు వచ్చాయి. విద్యార్థులు గమనించి వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాలేజీలో వార్డెన్ గాని, ఇన్‌చార్జి గాని లేకపోవడంతో విద్యార్థులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నాగారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. వెంకటేష్‌ను ఏదైనా విషసర్పం కాటేసిందా..? లేదా అతడే ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అనే విషయం తెలియరాలేదు. తనకు ఈ కాలేజీలో చదవడం ఇష్టం లేదని వెంకటేష్ తరచూ తమతో వాపోయేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వరంగల్ నుంచి వెంకటేష్ తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని అప్పగించారు.  
 
 విద్యార్థుల ఆందోళన
 బీటెక్ విద్యార్థి వెంకటేష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ టీజేఏసీ నాయకులు గంధం రాజశేఖర్, అశోక్, కిరణ్‌గౌడ్ తదితరులు శుక్రవారం కళాశాల క్యాంపస్‌కు చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కాలేజీ హాస్టల్‌లో సరిగా వసతులు లేవని మండిపడ్డారు. సరైన భోజనం లేక విద్యార్థులు పలుమార్లు అస్వస్థతకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎంతకూ కాలేజీ యాజ మాన్యం స్పందించలేదు. విద్యార్థి మృతి విషయమై కీసర పోలీసులను వివరణ కోరగా.. వెంకటేష్ తల్లిదండ్రులు గాని కాలేజీ యాజమాన్యం గాని తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement