మింగలేక.. కక్కలేక | Engineering officials irakatam | Sakshi
Sakshi News home page

మింగలేక.. కక్కలేక

Mar 30 2016 11:27 PM | Updated on Sep 3 2017 8:53 PM

‘ప్రభుత్వమిచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక్కరోజే గడువుంది. ఏదో ఒకటి చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి,

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ప్రభుత్వమిచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక్కరోజే గడువుంది. ఏదో ఒకటి చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి, శాఖాధిపతుల సతాయింపు భరించలేం. పనులు ప్రారంభించని చోట కనీసం సిమెంట్ అయినా బుక్ చేసేయాలి. ఒక్కసారి సిమెంట్ బుక్ చేస్తే పని అయిపోయినట్టే’ ఇదీ ఇంజినీరింగ్ ఉన్నతాధికారుల ఆదేశం.  దీంతో కాదనలేక, అవుననలేక మండల స్థాయి ఇంజినీరింగ్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఉన్నతాధికారులు చెప్పినట్టు సిమెంట్ బుక్ చేస్తే తదుపరి జరిగే అక్రమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాస్‌లు చెప్పినట్టు చేయకపోతే   ఇబ్బందులు తప్పవని అంతర్మథనం చెందుతున్నారు.
 
 నాణ్యతకు తిలోదకాలు
 జిల్లాలో రూ.800కోట్లతో ఉపాధి మెటీరియల్ కాంపొనెంట్ కింద పనులు మంజూరు చేశారు. వీటిలో అత్యధికంగా సీసీ రోడ్లే ఉన్నాయి. పనులు జోరుగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించడమే ధ్యేయంగా   నచ్చిన రీతిలో ఇసుక, సిమెంట్, కంకర కలిపి రోడ్లు వేస్తున్నారు. ఒకవైపు రోడ్లు నిర్మిస్తుండగానే మరో వైపు ధ్వంసమవు తున్నాయి.ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో నిధులెలా ఖర్చు చేయాలోననే చూస్తున్నారే తప్ప పనుల్లో నాణ్యత కనబడడం లేదు.  ఈ ఒక్కరోజులోగా పనులు చేపట్టకపోతే దాదాపు రూ. 20కోట్ల వరకు నిధులు నిరుపయోగమవుతాయన్న అభిప్రాయంతో   పని ప్రారంభించకపోయినా సిమెంట్ పేరుతో మండలానికి రూ. అరకోటి బుక్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.   
 
 వివక్షతో మూల్యం
 మంజూరు మేరకు పనులు ప్రారంభించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ పంచాయతీలనే తేడా లేకుండా పనులు చేపట్టి ఉంటే ఈపాటికే అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు అయిపోయేవి. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీకి చెందిన పలు పంచాయతీల్లో పనులు చేపట్టకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతలతో సెటిల్‌మెంట్ చేసుకుని, రాజీకొస్తేనే పనులు మొదలు పెట్టాలని లేదంటే బిల్లులు మంజూరవ్వవని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంజూరైన అన్ని చోట్ల పనులు ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. అందుబాటులో ఉన్న నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాని దుస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement