రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పెంచడం సరైన నిర్ణయం కాదని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ
ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సరికాదు
Feb 17 2014 2:39 AM | Updated on Jul 24 2018 2:17 PM
పార్వతీపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పెంచడం సరైన నిర్ణయం కాదని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామల సింహాచలం అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన పార్వతీ పురంలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సు పెంపుదల నిర్ణయం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు మేలు కలగొచ్చుగానీ లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందన్నారు. దీన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నా రు. పదేళ్లుగా రాష్ట్రప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీచేయడం లేదని విమర్శించారు.
తాత్కాలిక ఔట్‌సోర్సింగ్ పద్ధతిన, కాంట్రాక్ట్ విధానం ద్వారా మాత్రమే ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తోందన్నారు. ఇటీవల ఏపీపీఎస్‌సీ ప్రకటించిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఒక్కోపోస్టుకు వెయ్యిమంది వరకు పోటీ పడిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఎన్నికల లబ్ధికోసం ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచితే నిరుద్యోగుల భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. ప్రస్తుతం ఇన్‌సర్వీసులో ఉన్న టీచర్లు, ఉద్యోగులకు ప్రమోషన్లు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆయనతో పాటు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. దేవానంద్, జిల్లానాయకులు కె.తవుడు, జి. సూర్యనారాయణ, చింతాడ రాములు ఉన్నారు.
Advertisement
Advertisement