
ఉపాధి ఊడింది
అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా.. వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళానికి ప్రభుత్వం షాకిచ్చింది. వ్యవసాయ పనులు లేని రోజుల్లో రైతులు,
పాలకొండ:అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా.. వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళానికి ప్రభుత్వం షాకిచ్చింది. వ్యవసాయ పనులు లేని రోజుల్లో రైతులు, రైతు కూలీలకు పనులు కల్పించడం, వలసల నిరోధమే ప్రధాన లక్ష్యంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జిల్లాలో సగానికిపైగా మండలాలు ఉపాధి హామీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున వలసలు సాగుతున్న ఈ జిల్లాలో పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాల్సిందిపోయి మార్గదర్శకాల పేరుతో మండలాలను తొలగించడంపై నిరసన, ఆందోళన వెల్లవెత్తుతున్నాయి. జిల్లాలో 38 మండలాలు ఉండగా 15 మండలాలకే ఈ పథకాన్ని పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు ఆయా మండలాలను గుర్తించి పనులు నిలిపివేసేందుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల జిల్లాలో మళ్లీ వలసలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అధిక సంఖ్యలో కూలీలు
ఇప్పటివరకు ఉపాధి పథకం కింద పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధి పొందుతూ వచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం 7,68, 443 మంది ఉపాధా హామీ వేతనదారులు ఉన్నారు. ఇప్పటివరకు 5,48,085 మందికి జాబ్‌కార్డులు అందజేశారు. 32,610 సంఘాలు కొనసాగుతున్నాయి. వీరందరూ గత కొంతకాలంగా వ్యవసాయ పనులు లేని సమయాల్లో ఉపాధి పనులనే ఆసరాగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం 23 మండలాలను తొలగించడంతో 60 నుంచి 70 శాతం మంది కూలీలు ఉపాధి లేక వలసబాట పట్టాల్సి వస్తుంది.
మిగిలిన మండలాలివే...
పథకం నుంచి 23 మండలాలను తొలగించి 15 మండలాలనే కొనసాగించాలని నిర్ణయించారు. కొనసాగనున్న వాటిలో జి.సిగడాం, సరుబుజ్జిలి, సీతంపేట, వంగర, వీరఘట్టం, కొత్తూరు, భామిని, ఎల్.ఎన్.పేట, లావేరు, నందిగాం, పోలాకి, సంతకవిటి, రేగిడి , సారవకోట, సంతబొమ్మాళి మండలాలు ఉన్నాయి. వీటిలోనే ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
ప్రజాసంఘాల ఆగ్రహం
ఉపాధి హామీ పథకం నుంచి పలు మండలాలను తొలగించడంపై ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే కూలీలతో చర్చించి వివరాలు సేకరిస్తున్నారు. సీపీఐ, సీఐటీయూ, సీపీఎం తదితర పార్టీలు ప్రత్యక్ష పోరాటాలకు ముందుకొస్తున్నాయి. దీనిపై సీపీఎం నాయకులు దావాల రమణారావు, గంగరాపు ఈశ్వరమ్మలు మాట్లాడుతూ ఇది కూలీల పొట్టకొట్టే చర్య అని, దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే వలసలు ఓ పక్క అధికమవుతుంటే ఉన్న ఒక్క పథకాన్ని తొలగించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.