
16 నుంచి సమ్మె చేస్తాం
దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులు శుక్రవారం ‘మహాధర్నా’ కార్యక్రమాన్ని చేపట్టారు.
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులు శుక్రవారం ‘మహాధర్నా’ కార్యక్రమాన్ని చేపట్టారు. భారీగా తరలివచ్చిన విద్యుత్ ఇంజనీర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరసన వ్యక్తం చేశారు. నెలాఖరులోగా డిమాండ్లను పరిష్కరించకపోతే భారీఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఉద్యోగుల సంఘం (ఏపీఎస్‌ఈబీఈఏ), అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ మహాధర్నాను చేపట్టాయి.
ఈ సందర్భంగా ఏపీఎస్‌ఈబీఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్‌రావు, వేదవ్యాస్‌లతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిరణ్‌కుమార్, శ్రీనివాస్ మాట్లాడారు. పెరుగుతున్న కొత్త పోస్టులను భర్తీచేయాలని.. వేతన సవరణ కోసం కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఏఈల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినా ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. యాజమాన్యం వచ్చి చర్చిస్తేనే ఆందోళన విరమిస్తామని పట్టుబట్టారు. చివరకు ఉద్యోగులు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాతో చర్చించారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, భోజన విరామ సమయంలో ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రకటిం చారు. 5 నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని, 9న అధికారిక మొబైల్ నెంబర్లను అప్పగిస్తామని, 10 నుంచి సామూహికంగా సెలవులు పెడతామని తెలిపారు. అప్పటికీ పరిష్కరించకపోతే 16 నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు.