
విద్యుత్ సమ్మె వాయిదా
తుపాన్, పండుగల నేపథ్యంలో అత్యవసర సర్వీసులకు అంతరాయం కలగకుండా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ(సేవ్ జేఏసీ) చైర్మన్ సాయిబాబా ప్రకటించారు.
సీఎంతో సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు సఫలం
అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తానని సీఎం హామీ ఇచ్చారు: సాయిబాబా
సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశాం.. నిరసనలు కొనసాగుతాయి
సమైక్యాంధ్రకు అన్యాయం జరిగితే మళ్లీ మెరుపు సమ్మె
గురువారం మధ్యాహ్నం నుంచే విధుల్లోకి ఉద్యోగులు.. తొలగిన చీకట్లు
సాక్షి, హైదరాబాద్: తుపాన్, పండుగల నేపథ్యంలో అత్యవసర సర్వీసులకు అంతరాయం కలగకుండా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ(సేవ్ జేఏసీ) చైర్మన్ సాయిబాబా ప్రకటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డితో విద్యుత్ ఉద్యోగులు గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. అనంతరం సాయిబాబా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఓడిస్తామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రిమండలి కమిటీ నివేదికకు కూడా గడువు ప్రకటించనందున తాము సమ్మెను వాయిదా వేస్తున్నామని చెప్పారు. సమైక్యాంధ్రను మోసం చేస్తే మళ్లీ మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రస్తుతం చేసిన సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ వాణి వినిపించామని, ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని అన్నారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదావేసినా నిరసన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తామన్నారు. తమ సమ్మె కారణంగా విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులకు గురయినప్పటికీ.. సమైక్యాంధ్ర కోసం మౌనంగానే భరించారన్నారు. విద్యుత్ సరఫరాలేక ఆస్పత్రుల్లో రోగులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజల్ని చీకటిలో ఉంచినందుకు తమను క్షమించాలని కోరారు. ఇప్పటి వరకూ సమ్మెలో పాల్గొన్న 50 వేల మంది ఉద్యోగులూ శుక్రవారం నుంచి విధులకు హాజరుకావాలని సాయిబాబా విజ్ఞప్తి చేశారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాహూ, ట్రాన్స్‌కో ఇన్‌చార్జి సీఎండీ మునీంద్ర, జెన్‌కో ఎండీ విజయానంద్, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, గణేశ్, నరసింహులు, అనురాధ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన డిమాండ్..
విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌లో విద్యుత్ సరఫరా చేయాల్సింది 1,700 మెగావాట్లు ఉండగా... ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ పరిధిలో 1,300 మెగావాట్లు తీసుకోవాల్సి ఉండగా.. ఏకంగా 1,600 మెగావాట్లు వినియోగించారు. దీంతో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.5 హెట్జ్‌కు పడిపోయింది. అయితే, తిరిగి విద్యుత్ కోతలు విధించడంతో సాధారణ స్థితికి చేరుకుంది. శుక్రవారం నుంచి విధుల్లో పాల్గొంటామని నేతలు ప్రకటించినప్పటికీ.. గురువారం మధ్యాహ్నం నుంచి విధుల్లో చేరారు. అనంతరం శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏడు యూనిట్లకు నాలుగు యూనిట్లలో సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎగువ సీలేరు, డొంకరాయిలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు(ఆర్‌టీపీపీ)లో ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి విధుల్లో చేరారు. గురువారం రాత్రి నాటికి నాలుగో యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించారు. విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్‌టీటీపీఎస్)లో ఉద్యోగులు సాయంత్రం నుంచి విధుల్లో చేరారు. సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలని కోరారు. ఇందుకు యాజమాన్యం పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం నుంచి విధులకు హాజరయ్యారు. ఇందులో కూడా విద్యుత్ ఉత్పత్తి చర్యలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది సరికాదు
సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రధాన విద్యుత్ ఉద్యోగ సంఘాలతో విద్యుత్ సౌధలో జెన్‌కో ఎండీ కె. విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ (ఇన్‌చార్జి) మునీంద్రలు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. విద్యుత్ లాంటి అత్యవసర రంగం, ప్రజలకు ఎంతో అవసరమైన రంగంలో సమ్మె చేయడం సరికాదని సంఘాల నాయకులకు అధికారులు వివరించారు. మరోసారి సమ్మెకు దిగకుండా మీ సంఘంలోని కార్యకర్తలకు సూచించాలని కోరారు. ఇందుకు సంఘాల నాయకులు సమ్మతి తెలిపారు.