చీకట్లు | Sakshi
Sakshi News home page

చీకట్లు

Published Mon, May 26 2014 11:45 PM

చీకట్లు - Sakshi

  • గాడాంధకారంలో గ్రామీణ విశాఖ
  •  విద్యుత్ లేక అల్లాడుతున్న జనం
  •  సాగు, తాగునీటికి అవస్థలు
  •  చిరు వ్యాపారుల ఉపాధికి గండి
  • అసలే మండువేసవి. అపై విద్యుత్ సరఫరా నిలిపివేత. విద్యుత్ ఉద్యోగుల సమ్మె‘ట’ దెబ్బకు జనజీవనం కళ్లు బైర్లు కమ్ముతోంది. ఎప్పుడు విద్యుత్ ఉంటుందో తెలియదు. ఎప్పుడొస్తుందో అంతుబట్టదు. విద్యుత్‌పైనే బతుకు బండిని నడిపే చిరు వ్యాపారులది మరీ దైన్యం. వ్యాపారం సాగక విలవిల్లాడిపోతున్నారు. గ్రామీణ విశాఖ ప్రజలు ‘ఉక్క’రిబిక్కిరవుతున్నారు. విద్యుత్ సిబ్బందితో ప్రభుత్వ చర్చలు ఫలించకపోతే మంగళవారం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది.
     
    సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కనీసం పగటిపూట విద్యుత్ అంతరాయాలున్నా.. సాయంత్రానికి సిబ్బంది జాలి తలచేవారని, ప్రస్తుతం అదీ లేదని వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంతలో కొంత మెరుగ్గా ప్రయివేటు సిబ్బందితో మరమ్మతులు కానిచ్చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతవాసులు మరీ నరకం చవిచూస్తున్నారు. సాధారణంగా సిబ్బంది సమ్మెలో ఉన్నపుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే మరమ్మతులు చేపట్టే పరిస్థితి ఉండదు.

    గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకపోయినా.. సిబ్బంది సమ్మెలోకి వెళ్తూ ఫ్యూజ్‌లు పీకి పట్టుకెళ్లిన సంఘటనలున్నాయి. దీంతో స్థానికంగా కరెంట్ పనులు తెలిసినవారితో సరఫరా పునరుద్ధరించడానికి కూడా వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. నగర శివారు ప్రాంతాలతోపాటు, గ్రామీణ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మోటారు పంపింగ్ ద్వారా నీటి సరఫరా చేసే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక, నీళ్లు రాక జనాలు అల్లాడారు.

    సోమవారం చర్చలు ప్రారంభం కావడంతో.. ఉద్యోగులు పూర్తిగా తమ ప్రతాపం చూపలేదని ఈపీడీసీఎల్  ఉన్నతాధికారులు చెబున్నారు. మధ్యాహ్నం చర్చలు విఫలమయ్యాక కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ రాత్రి చర్చలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించకపోతే మంగళవారం పరిస్థితి మరెలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు.

    పరిశ్రమలకు మంగళవారం కూడా లైటింగ్ లోడ్ (10 శాతం) అమలు చేయాల్సిందిగా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అల్పపీడనం, మబ్బులు, చిరుజల్లుల వాతావరణంతో కాస్త చల్లగా ఉండటం వల్ల కొంతయినా ఉపశమనం కలుగుతోందని, లేకుంటే విద్యుత్ వెతలతో ప్రాణాలు పోయేవని జనాలు గగ్గోలు పెడుతున్నారు.
     

Advertisement
Advertisement