ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలలో మెనూ తప్పుతోంది. ధర పెరగడంతో పౌష్టికాహారంలో గుడ్డు దూరమవుతోంది.
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలలో మెనూ తప్పుతోంది. ధర పెరగడంతో పౌష్టికాహారంలో గుడ్డు దూరమవుతోంది. విద్యార్థులు, బా లింతలకు గుడ్డు లేకుండానే భోజనం వడ్డిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11 నెలల క్రితం అమృతహస్తం ప్రవేశపెట్టింది. జిల్లాలో భీమ్‌గల్, దోమకొండ, ఎల్లారెడ్డి, మద్నూర్, బాన్సువాడ ఐసీడీఎస్ డివిజన్‌ల పరిధిలోని 19 మండలాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఆయా మండలాల పరిధిలో పథకం ప్రారంభ సమయంలో 11,694 మంది గర్భిణులు, 7,650 మంది బాలింతలు ఉన్నారు. ఈ పథకం బాలారిష్టాలను దాటడం లేదు. సమన్వయ లోపంతో అభాసుపాలవుతూనే ఉంది. ఈ పథకంలో ఒక్కో లబ్ధిదారుకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం రూ. 15 చొప్పున గ్రామైక్య సంఘాలకు చెల్లిస్తోంది. అయితే గ్రామైక్య సంఘాలు, ఐసీడీఎస్ అధికారుల మధ్య సమన్వయలోపంతో పథకం సరిగా అమలు కావడం లేదు. దీంతో పోషకాహారం సరఫరా చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు సకాలంలో బిల్లులు అందడం లేదు. కొన్ని గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇప్పటికీ పాలు సరఫరా చేయడం లేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు అప్పులు చేసి పోషకాహారం అందిస్తున్నారు.
15 రోజుల నుంచి
అమృతహస్తం లబ్ధిదారులకు పదిహేను రోజుల నుంచి కోడి గుడ్డు అందించడం లేదని తెలిసింది. కోడిగుడ్డు ధరలు పెరగడంతో ఏజెన్సీ నిర్వాహకులు గుడ్లను సర ఫరా చేయడం లేదు. దీంతో ఆయా అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలకు గుడ్డులేని భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం కోడిగుడ్డుకు రూ. 3.50 చెల్లిస్తుండగా ప్రస్తుతం మార్కెట్‌లో 5 రూపాయలకో గుడ్డు విక్రయిస్తున్నారు. దీంతో ఏజెన్సీలు కోడిగుడ్డు సరఫరాను నిలిపివేశాయి. ధరలకు అనుగుణంగా స్లాబ్ రేట్ పెంచాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.