వైఎస్సార్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి 

Dutta Ramachandra Rao Demands Bharat Ratna For YS Rajasekhara Reddy - Sakshi

వైఎస్సార్‌ సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి ‘భారత రత్న’ బిరుదు ప్రదానం చేయాలని ఆయన సన్నిహితుడు, వైఎస్సార్‌ సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. హనుమాన్‌జంక్షన్‌లోని ఆయన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందించే భారతరత్న బిరుదుకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అన్ని విధాలా అర్హుడని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ రంగం నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు కె.కామరాజ్, ఎం.జి.రామచంద్రన్, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం గోవింద్‌ వల్లభ్‌ పంత్, అస్సాం మాజీ సీఎం గోపీనాథ్‌బర్ధోలికు భారతరత్న ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. 

ఇదే కోవలో ఎన్నో చారిత్రాత్మక పథకాలతో స్ఫూర్తిదాయక పాలన అందించిన డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి భారత రత్న బిరుదు ప్రదానం చేయాలన్నారు. పేద ప్రజల కోసం వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సీమెంట్, 108 అంబులెన్స్, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి పథాకాలు దేశానికి ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచాయని డాక్టర్‌ దుట్టా చెప్పారు. మండు వేసవిలో 1460 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేసిన తొలి నేత రాజశేఖరరెడ్డి అని చెప్పారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. 1978 నుంచి 2009 వరకు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలుపొందిన ఏకైక నాయకుడుగా రికార్డు సృష్టించారని తెలిపారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగు సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా వరుస విజయాలు సాధించారని దుట్టా చెప్పారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టి ప్రజల ఆకాంక్షను  కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top