సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం నిరుపేదలైన పింఛనుదారులపైనా పడింది. నగర, పురపాలక సంఘాల సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో ఈ నెల పింఛన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది.
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం నిరుపేదలైన పింఛనుదారులపైనా పడింది. నగర, పురపాలక సంఘాల సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో ఈ నెల పింఛన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కష్టంగా మారింది. ప్రతి నెల ఒకటి, 5వ తేదీల్లో పింఛను అందుకునే వారు. ఈ దఫా సమ్మె కారణంగా ఇప్పటి వరకు అందలేదు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాల పరిధిలో 43 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఒక్క అనంతపురంలోనే 23 వేల మంది ఉన్నారు. పింఛను సొమ్ము బ్యాంక్‌లో కూడా జమ అయ్యింది. డీఆర్‌డీఏ నుంచి అక్విటెన్స్‌లూ వచ్చాయి.
అయినా సిబ్బంది సమ్మె కారణంగా పంపిణీకి నోచుకోలేదు. దాదాపు 49 మండలాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్మార్ట్ కార్డులు, ఐకేపీ సంఘాల సభ్యుల ద్వారా పింఛన్ పంపిణీ చేశారు. నగర, పురపాలక సంఘాల పరిధిలో స్మార్ట్ కార్డుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంపిణీ సాధ్యపడలేదు. నగరం, పట్టణాల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా పంపిణీ చేయించేలా అధికారులు చొరవ తీసుకొని ఉంటే సమస్య పరిష్కారమయ్యేది. అయితే వారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.