గ'మ్మత్తు' వైద్యం

Drunked Doctor Treatments in West Godavari PHC - Sakshi

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

మద్యం మత్తులో వైద్య సేవలు

ప్రభుత్వ వైద్యుని నిర్వాకం

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం రూరల్‌: కనిపించే దైవంగా రోగులు వైద్యులను భావిస్తుంటారు. అటువంటి వైద్యుడే మద్యం మత్తులో సేవలందించడం విస్మయానికి గురి చేస్తోంది. అంతే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న రోజువారీ కూలీ, ఆమె తల్లి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం గమనార్హం. ఈ ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీలో శాశ్వత ప్రాతిపదికన రెండో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఈయన గత నెల 25న పీహెచ్‌సీలో వైద్యుడిగా బాధ్యతలు చేపట్టారు. అతను మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నట్టు డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేయగా, గత  నెల 28న విచారించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సహచర సిబ్బంది వాపోయారు. మద్యం మత్తులో విధులకు హాజరు కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆసుపత్రిలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న మనెల్లి స్వర్ణలత తన కుమార్తెకు యాక్సిడెంట్‌ కావడంతో గురువారం ఆమె తల్లిని ఆసుపత్రిలో పనికి పంపించింది. ఉదయం 6.30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన రెండో డాక్టర్‌ ఆమెను నిలదీశారు. కుమార్తెను దగ్గరుండి తీసుకురమ్మని చెప్పడంతో ఆమె తన తల్లితో ఆసుపత్రికి వెళ్లింది. తన కుమార్తెకు యాక్సిడెంట్‌ కావడంతో తన తల్లిని పంపించానని చెప్పినట్లు పేర్కొంది. డాక్టర్‌ యాక్సిడెంట్‌ నీకు కాదు కదా జరిగింది అని చులకనగా మాట్లాడారని, ఇంగ్లిష్‌లో తిట్టారని ఆమె ఆరోపించింది.  ఈ మేరకు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది. ఈ విషయమై రూరల్‌ ఎస్సై బి.శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ఇప్పటి వరకు తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఒకరు వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీ వద్ద హడావుడి చేయడం గమనార్హం. ఫిర్యాదు చేయకుండా పోలీస్‌ సిబ్బంది పీహెచ్‌సీకి ఎలా వచ్చారనేది విశేషం.   

వెంకట్రామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
రెండో డాక్టర్‌పై చర్యలకు సిఫార్స్‌ చేశాం  
డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ గత నెల 25న విధుల్లో చేరారు. అప్పట్నించి మద్యం తాగి విధులకు రావడంతో ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశంలో దుర్గాప్రసాద్‌ను తొలగించి వేరే డాక్టర్‌ను నియమించాలని కోరుతూ తీర్మానించాం. ఆయనను విచారణ కూడా చేశారు. ఇంకా నివేదిక  రాలేదు. మరలా మద్యం తాగి వచ్చ నాతోనూ, దిగువ స్థాయి సిబ్బందితో గొడవపడటం, నోటికొచ్చినట్లుగా మాట్లాడటం చేస్తున్నారు. దుర్గాప్రసాద్‌ స్థానంలో కొత్త వారిని నియమించాలి.– కె.రవికుమార్, సీనియర్‌ డాక్టర్, వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీ

విచారణ చేస్తున్నాం
వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీ రెండో వైద్యాధికారి దుర్గాప్రసాద్‌పై స్వీపర్‌ స్వర్ణలత ఫిర్యాదు చేశారు. ఆమెతోపాటు డాక్టర్‌ను విచారణ చేస్తున్నాం.– బి.శ్రీనివాస్, ఎస్సై,తాడేపల్లిగూడెం రూరల్‌ పీఎస్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top