ఏపీకి గొప్ప వరం  ఆరోగ్యశ్రీ

Dr Srinath Reddy Comments About Aarogyasri - Sakshi

అన్ని వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంకల్పం అద్భుతం 

ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో వైద్య బీమా అమలు చేయడం లేదు 

సాక్షితో కేంద్ర మాజీ ఆరోగ్య సలహాదారు, ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి  

సాక్షి అమరావతి: ‘పేదలు, సామాన్యులకు ఉచితంగా.. అన్ని వైద్య సేవలు అందించాలంటే గొప్ప సంకల్పం ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త మార్పులతో అమలు  చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఆ గొప్ప సంకల్పం నాకు కనిపిస్తోంది. అన్ని ఖరీదైన చికిత్సలతో పాటు డెంగీ, మలేరియా వంటి జ్వరాలను ఈ పథకంలో చేర్చడం రాష్ట్ర ప్రజలకు గొప్ప వరంగా భావించాలి. ఇలాంటి పథకం అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేందుకు ఆరోగ్యశ్రీ పథకమే ఉదాహరణ’ అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, యూపీఏ ప్రభుత్వంలో ఆరోగ్య సలహాదారుగా పనిచేసిన డా.కె.శ్రీనాథరెడ్డి.. పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులుగా కూడా ఉన్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. 

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో మార్పులు చేర్పులపై మీ అభిప్రాయం?
ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీ పేరిట అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ గొప్ప పథకం. ప్రస్తుత వ్యాధుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే.. ఈ పథకంతో చేకూరే లబ్ధి వల్ల అన్ని రకాల వైద్య సేవలు సామాన్యులందరికీ చేరువైనట్లే భావించాలి. పకడ్బందీగా అమలు చేస్తే పేదవారి జేబునుంచి ఏమీ ఖర్చు కాదు.

ఖరీదైన చికిత్స అవసరమయ్యే వ్యాధులను ఈ పథకంలో చేర్చారు. అంత భారీ వ్యయం  చేయడం సాధ్యమేనా?
క్యాన్సర్, న్యూరో, గుండెజబ్బులతో పాటు వందలాది జబ్బులు జాబితాలో ఉన్నాయి. వీటికి చాలా వ్యయమవుతుంది. సామాన్యులకు వచ్చే వ్యాధులకు ఉచితంగా వైద్యమందించాలనే దృక్పథంతోనే ఈ జబ్బుల్ని చేర్చారు. భారమైనా ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యమే. 

ఆరోగ్యశ్రీలో నిబంధనల్ని సరళతరం చేశారు. ఈ మార్పులతో సామాన్యులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది?
ప్రమాదకర రోగాల చికిత్స కోసం పేదలు డబ్బు ఖర్చు పెట్టలేక మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పథకం అందుబాటులో ఉండి, సకాలంలో వైద్యమందితే లక్షలాది మందికి ప్రాణదానం చేసినట్లే.. 

రూ.1000 దాటితే రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు. దీని సాధ్యాసాధ్యాల గురించి ఏమంటారు?
కచ్చితంగా సాధ్యమే. 2,059 జబ్బుల పరిధిలో బిల్లు రూ. వెయ్యి దాటితే చికిత్స అందిస్తున్నారు. ఇందులో 170 వరకూ డే కేర్‌ జబ్బుల్ని చేర్చారు. మొదట కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే మిగతా జిల్లాల్లో అమలు చేసే సమయానికి అంతా సర్దుకుంటుంది.

డెంగీ, మలేరియా వంటి జ్వరాలనూ పథకం పరిధిలో చేర్చారు. ఈ కొత్త సౌలభ్యం సామాన్యులకు ఎంతవరకూ ఉపయోగపడుతుంది.?
ఇటీవలి డెంగీ వంటి జ్వరాలు సోకినప్పుడు సామాన్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ కోసం బాగా ఖర్చవుతుంది. మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాల వల్ల కూడా వేలకు వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. పైగా ఇలా జ్వరాల బారిన పడుతున్న వారు వేలల్లో ఉంటారు. కొన్ని జ్వరాలను ఈ పథకంలో చేర్చడం వల్ల అలాంటి వారికి లబ్ధి చేకూరుతుంది.

మీరు ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య బీమా పథకాలు చూసుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీపై ఒక ప్రముఖ వైద్యుడిగా మీ అభిప్రాయం?
సామాన్యులకు వైద్యబీమా కల్పించి అమలు చేయడంలో దేశంలో గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పగలను. నాకు తెలిసినంత వరకూ మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి వైద్యబీమా పథకాన్ని చూడలేదు. నిధుల వ్యయం ఒక్కటే కాదు, అమలు చేయాలంటే ప్రభుత్వాలకు గొప్ప సంకల్పం ఉండాలి.   

రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయం చేయడంపై మీ అభిప్రాయం?
నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఇలా ఆర్థిక సాయం చేయడం చూడలేదు. కుటుంబ ప్రధాన పోషకుడు జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. శస్త్రచికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోజుకు రూ.225 ఇవ్వడమంటే సాహసోపేత నిర్ణయం. 

గతంలో ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది కాదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం ఎంత వరకూ ప్రయోజనకరం?
కొన్ని చికిత్సలకు కొన్ని ప్రాంతాల్లో వైద్యం చేసే అవకాశం ఉండకపోవచ్చు. రోగులకు న్యాయం జరగాలంటే ఎక్కడ వైద్యం ఉంటుందో అక్కడ చేయించాలి. ఏపీ ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వైద్యానికి అనుమతించడం గొప్ప పరిణామం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top