
నేటి అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ చేస్తామన్న ఆస్పత్రులు
బకాయిల్లోరూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
బంద్ కొనసాగింపుపై యాజమాన్యాల్లో భిన్నాభిప్రాయాలు
సేవలు నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం నెలకొంది. బకాయిలు చెల్లించని కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన తర్వాత సోమ వారం ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు పునరాలోచనలో పడినట్లు తెలిసింది.
కొన్ని యాజమాన్యాలు బంద్ కొనసాగించాలని భావిస్తుండగా, ప్రభుత్వంతో గొడవ ఎందుకు అనే ధోరణిలో మరికొన్ని యాజమాన్యాలు ఉన్నట్లు సమాచారం. అయితే అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మాత్రం మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని తెలిపారు.
రూ.100 కోట్లు ఇస్తే ఎలా?: ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు గత నెల 25న నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ప్రభుత్వం పిలిపించి మాట్లాడడంతో పాటు బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇవ్వడంతో సేవల నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
అయితే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇతర చెల్లింపుల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కుదర్లేదు. దీంతో హాస్పిటల్స్ అసోసియేషన్ తాజాగా మరోసారి అల్టిమేటం ఇచ్చింది. అయితే ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఏం చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. రూ.1,400 కోట్ల బకాయిలు ఉంటే రూ.100 కోట్లు ఇస్తే ఎలా అని డాక్టర్ రాకేష్ ప్రశ్నించారు.