నా రాజీనామాకు కారణం అదే: డొక్కా

Dokka Manikya Varaprasad Oath Taking As MLC - Sakshi

సాక్షి, అమరావతి: డొక్కా మాణిక్య వరప్రసాద్ మంగళవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డొక్కా మాణిక్య వరప్రసాద్‌  ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారన్నారు. అంతకు ముందు ఆయన తెలుగుదేశం నుంచి గెలిచి తర్వాత వైసీపీలో చేరారని తెలిపారు. అయితే  వైసీపీలో చేరే ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారన్నారు. ఆ  తర్వాత ఆయన స్థానానికి వైసీపీ మళ్లీ ఆయన్నే నిలబెట్టిందన్నారు. టీడీపీ పదవులు వదిలేసి వైసీపీ టికెట్‌పై గెలిచిన మొదటి వ్యక్తి డొక్కా అని ప్రశంసించారు. రాజీనామా చేస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అని చెప్పిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. తమ పార్టీ నైతిక విలువలకు ఇదే నిదర్శనం అని అంబటి స్పష్టం చేశారు.

నా రాజీనామాకు అదే కారణం: డొక్కా
అనంతరం డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు ​ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  చట్టసభలు అత్యధిక ప్రమాణాలతో ఉండాలని భావిస్తానన్నారు డొక్కా.  ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా తాను సభకు ఆబ్సెంట్ అవ్వలేదని తెలిపారు. అలాంటిది మండలిలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయాలు గౌరవించాలని సూచించారు. శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూడటం బాధ కలిగించింది అన్నారు. తాను రాజీనామా చేయడానికి ఇది ఒక కారణమని చెప్పుకొచ్చారు. మండలి అంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలా ఉండాలన్నారు.  మండలి చైర్మన్‌కు కొందరు తప్పుడు గైడెన్స్ ఇచ్చారని డొక్కా ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top