ప్రైవేట్‌ మోజు..!

Doctors Negligence in Ruia Hospital Chittoor - Sakshi

ప్రైవేట్‌ ప్రాక్టీసుతో పేదల ఆస్పత్రిపై  రుయా వైద్యుల చిన్నచూపు

ఆర్థోలో శస్త్ర చికిత్సల వాయిదాల పర్వం

మధ్యాహ్న వేళల్లో అనస్తీషియా వైద్యుల గైర్హాజరు

అవస్థలు పడుతున్న నిరుపేద రోగులు  

రుయా ఆస్పత్రిలో నిత్యం 20కి పైగా శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి.అందులో సర్జరీ విభాగంతో పాటు ఆర్థో విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్లు     నిర్వహిస్తుంటారు. ఆస్పత్రిలో ఆర్థో వైద్యులు శస్త్ర చికిత్సలను నిర్వహించేందుకు అందుబాటులో ఉన్నా అనస్తీషియా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఆర్ధో వైద్యులు విధిలేక ఆపరేషన్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఆపరేషన్‌ ఖరారు చేసిన తారీఖు కాకుండా వేరొక రోజు శస్త్ర చికిత్సలునిర్వహిస్తున్నారు. దీంతో రోగులు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది.

చిత్తూరు జిల్లా వెంకటాపురానికి చెందిన నాగరాజుకు కుడికాలు యాంకిల్‌ జాయింట్‌ విరిగిపోయింది. గత నెల 22న రుయా ఆర్థో విభాగంలో సర్జరీ జరగాల్సి ఉంది. అయితే అనస్తీషియా వైద్యులకు సమయం సరిపోకపోవడంతో సర్జరీని వాయిదావేశారు. సర్జరీ అంటూ ఆపరేషన్‌ థియేటర్‌ వరకు తీసుకెళ్లిన రోగిని మళ్లీ వార్డుకు తీసుకొచ్చారు. ఆపరేషన్‌కు రోగి మానసికంగా సిద్ధమైన సమయంలో వాయిదా వేయడం వల్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తిరుపతి (అలిపిరి): రుయా ఆర్థో విభాగంలో శస్త్ర చికిత్సలు వాయిదాలు పడుతున్నాయి. అనస్తీషియా వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై దృష్టి సారించడంతో రుయాలో రోగులకు శస్త్ర చికిత్సల నిమిత్తం మత్తు మందు ఇవ్వడానికి సమయం సరిపోవడం లేదు. ఫలితంగా రోగిని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్స నిర్వహించకుండా తిరిగి వార్డుకు పంపుతున్నారు. దీంతో రోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అనస్తీషియా వైద్యులు మధ్యాహ్నం 2 గంటలు దాటితో రుయాలో అందుబాటులో లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అనస్తీషియా విభాగం పనితీరుపై రుయా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో నిరుపేద రోగుల అవస్థలు వర్ణనా తీతంగా మారాయి.

అనస్తీషియన్ల డుమ్మా
రుయా ఆస్పత్రి అనస్తీషియా విభాగంలో ప్రొఫెసర్లు ముగ్గురు. అసోసియేట్లు నలుగురు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు  12 మంది ఇలా మొత్తం 19 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందించాలి. అయితే అనస్తీషియా వైద్యులు మధ్యాహ్నం 2 గంటలు దాటితే విధులకు డుమ్మా కొడుతున్నారు.

ప్రైవేట్‌ ప్రాక్టీస్‌
రుయా ఆస్పత్రి అనస్తీషియా వైద్యుల్లో ఎక్కువమంది ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నవారే ఉన్నారు. పలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తుండడంతో నిరుపేదల ఆస్పత్రి రుయాకు సేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రుయా ఆస్పత్రి వైద్యులు అంటే హై క్వాలిఫైడ్‌ అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనిని ఆసరాగా చేసుకుని సొంత పనుల కోసం నిరుపేదల శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారన్న విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలంటే చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

పట్టించుకోని ఉన్నతాధికారులు
రుయా ఆస్పత్రి ఆర్థో విభాగంలో సర్జన్లు అందుబాటులో ఉన్నా అనస్తీషియన్లు సమయపాలన పాటించకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం శస్త్ర చికిత్సలు వాయిదా పడుతున్నా ఉన్నతాధికారులు అటుగా కన్నెత్తి చూడడం లేదు. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్థో విభాగంలో సకాలంలో శస్త్ర చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుయా ఆర్థో విభాగంలో అనస్తీషియన్లకు సమయం సరిపోక సర్జరీలు వాయిదా వేస్తున్నారన్న దానిపై అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్‌ జమునను ‘సాక్షి’ వివరణ అడిగే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేరు.   

వాయిదాల తంతు ఇలా..
మే 20న సుబ్బమ్మ అనే రోగికి ఆర్థో విభాగంలో శస్త్ర చికిత్స జరగాల్సి ఉంటే అనస్తీషియన్లకు సమయం సరిపోక వాయిదా వేశారు. 23న ఆర్థో వైద్యులు సర్జరీ నిర్వహిం చారు.
మురుగయ్యకు మే 9న సర్జరీ జరగాల్సి ఉంటే వాయిదా వేసి 13వ తేదీన నిర్వహించారు.
ఆదినారాయణకు మే 16న జరగాల్సిన శస్త్ర చికిత్స వాయిదా వేసి 20వ తేదీ నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top